దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లుతోంది. ఓటు హక్కును పరిరక్షిం చాలని, ఎన్నికల సంఘం పనితీరుపై సమాధానం చెప్పాలని గొంతెత్తిన ప్రజలను అడ్డుకోవడానికి పాలకులు చేస్తున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్య పునాదులనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్), ఎన్నికల సంఘం వ్యవహారశైలికి నిరసనగా అక్టోబర్ 10న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, ఎఐఎస్ఎస్ వంటి విద్యార్థి, డివైఎఫ్ఐ, ఎఐవైఎఫ్ యువజన సంఘాలు జంతర్‌మంతర్ వద్ద తలపెట్టిన ప్రదర్శనకు అనుమతి నిరాకరించడంతో ఆంక్షలు తీవ్రరూపం దాల్చాయి. 57 మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల మూసివేత, రైళ్ల రద్దు, ఇంటర్నెట్ సేవల నిలిపివేత, బారికేడ్లు, నిషేధాజ్ఞలు, ముందస్తు నిర్బం ధాలు ప్రజాస్వామ్య పరిస్థితిపై ఆందోళన కలిగిస్తున్నాయి. ఓటు హక్కుపై తీవ్ర ఆందోళనలు, అనుమానాలు తలెత్తిన వేళ, స్పష్టత ఇవ్వాల్సిందిపోయి హక్కుల్ని కాలరాయడం ఎంతవరకు సమంజసం? రాజ్యాంగంలోని 19(1)(బి) అధికరణ శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు ను, 19(1)(ఎ) అధికరణ భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తున్నాయి. ఇవి ప్రభుత్వాలు ప్రసాదించిన వరాలు కావు. పౌరుల ప్రాథమిక హక్కులు. శాంతిభద్రతల పరిర క్షణకు సహేతుకమైన ఆంక్షలు విధించ వచ్చుగానీ, వాటి పేరుతో ప్రజల గొంతు నొక్కడం సమర్థనీ యం కాదు. పదమూడు కోట్లకు పైగా ఓటర్ల పేర్లు తొలగించ బడ్డాయంటే, దాని తీవ్రతను తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే, ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే ఒక్కఓటు కూడా కీలకమైనప్పుడు, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపో యాయనే ఆందోళనలపై ప్రజలు ప్రశ్నించడం సహజం. కేంద్రం ఇప్పటివరకు అక్రమ చొరబాటుదారులను ఏరివేయడానికే ‘సర్’ అని చెబుతోంది. ఇప్పుడు నిరసనలకు దిగింది విదేశీ చొరబాటుదారులు కాదు, ఈ దేశ పౌరులు. ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన, అరెస్టుకు సంబంధించిన పరిణామాలు, ప్రతిపక్షాల నిరసనలు దేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్య హక్కు లపై చర్చను మరింత ముందుకు తెచ్చాయి. తర్వాత జంతర్‌మంతర్ వద్ద శాంతియుత నిరసనలకు కాంగ్రెస్, వామపక్షాలు సహా ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు తెలపడం ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఓట్చోరీ , ఎన్నికల సంఘం వ్యవ హారంపై ‘ఇండియా’ కూటమి పక్షాలు శుక్రవారం రాష్ట్రపతిని కూడా కలిసి విన్నవించాయి. సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ ఢిల్లీలో పోలీసుల నిర్బంధాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం స్పందించి కేంద్రానికి కీలక ఆదేశాలు జారీచేసింది. మెట్రోస్టేషన్లతో పాటు, ప్రధాన రైల్వేస్టేషన్లు పూర్తిగా మూసివేయడం సరికాదని, ఆంక్షలతో స్టేషన్లను తెరవాలని సూచించింది. ఆంక్షలతో తెరవడమంటే? నిర్భంధం మధ్య ప్రజలు రాకపోకలు సాగించాలనేది న్యాయస్థానం ఆదేశాల్లో కనిపిస్తోంది. ఇన్నింటి మధ్య ఢిల్లీ పరిణామాలు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణపై ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. నిరసనకారులను నిరంతరం పర్యవేక్షించడానికి సీసీటీవీ నిఘా, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాలను అధికార, పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. రైల్వే, బస్స్టేషన్ల వద్ద భద్రతను పెంచింది. సోషల్‌మీడియా పోస్టులపైనా నిఘా పెట్టింది. మెట్రో సేవలపై ఆంక్షలు, బారికేడ్లు, ముందస్తు నిర్బంధాలు వంటి చర్యలు శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలనుకునే పౌరులకు ఆటంకంగా మారుతున్నాయి. ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఆంక్షలతో గొంతు నొక్కడం ప్రజాస్వామ్యంపై వారి విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. నేటి ఉద్యమాల్లో విద్యార్థులు, యువత పాత్రను తక్కువ అంచనా వేయలేం. నీట్ పేపర్ లీక్, కాక్రోచ్ ఆందోళనలు, కేంద్ర విద్యామంత్రి రాజీనామా పరిణామాలతో కూడా పాలకులు గుణపాఠం నేర్చినట్టు లేదు. నిరుద్యోగ యువత సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని పంచుకుంటూ ఉద్యోగాలు, విద్య, అవినీతి, ప్రజాస్వామ్య హక్కులపై ప్రశ్నిస్తోంది. బంగ్లాదేశ్‌లో 2024 విద్యార్థి ఉద్యమం, నేపాల్‌లో 2025 యువత నిరసనలు యువత అసంతృప్తిని బలప్రయోగంతో అణచలేమని గుర్తుచేస్తున్నాయి. ఇతర దేశాల పరిస్థితులు భిన్నమైనప్పటికీ, యువత ప్రశ్నలను వినడం, సమస్యలకు పరిష్కారాలు చూపడం పాలకుల బాధ్యత. ప్రజల గొంతు పాలకులకు అసౌకర్యంగా అనిపించినా, దాన్ని అణచివేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావు. ఓటు హక్కుపై స్పష్టత ఇవ్వాలి. ఎన్నికల సంఘం జవాబుదారీగా ఉండాలి. నిరసన హక్కును గౌరవించాలి. ప్రతి అర్హుడి ఓటు విలువను, ప్రజల స్వేచ్ఛను, రాజ్యాంగంపై వారి నమ్మకాన్ని కాపాడటమే నిజమైన ప్రజాస్వామ్యం. ఈ బాధ్యత నుంచి ఏ వ్యవస్థా తప్పించుకోలేదు.a







కామెంట్లు (0)