ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదాలతో, ఓటు హక్కును కాపాడాలన్న లక్ష్యంతో ఇండియా కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించిన మరుసటి రోజే హైదరాబాద్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నేతృత్వంలో బీజేపీ రాజకీయ ఎత్తుగడకు దిగింది. ఢిల్లీలో రాహుల్‌గాంధీ ఎన్నికల అక్రమాలపై ప్రశ్నిస్తూ, ఓటు అనేది ప్రజల గొంతుకని, దాన్ని దొంగిలించడం ప్రజాస్వామ్యంపై దాడి అని హెచ్చరించారు.సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు మరో స్వాతంత్ర్య పోరాటం అవసరమని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను నిలబెట్టాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ బాధ్యత వహించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అధికారపక్షం హైదరాబాద్‌లో ‘లోక్తంత్ర బచావో-అరాచకత హటావో’ నినాదంతో రంగంలోకి దిగడం ఆశ్చర్యాన్ని కలిగిచింది.
ఢిల్లీ సభను ఓటు హక్కు పరిరక్షణ పోరాటంగా కాకుండా చొరబాటుదారులను కాపాడే ప్రయ త్నంగా అమిత్‌షా అభివర్ణించడం చూస్తే ‘దొంగే.. దొంగ’ అని అరిచినట్టుగా ఉంది.
కాంగ్రెస్ అక్రమ బంగ్లాదేశీ చొర బాటుదారులకు అండగా నిలు స్తోందని, ఎస్ఐఆర్ను అడ్డుకుం టోందని అమిత్‌షా ఆరోపించారు. మూడు కోట్ల మంది బంగ్లాదేశీయులు ఓటర్ల జాబితాలో ఉన్నారని అమిత్‌షా చేసిన ప్రకటనకు ఆధారా లేమిటి? వారిని విదేశీయులుగా నిర్ధారించిన అధికారిక జాబితా ఎక్కడుంది? నిజంగా మూడు కోట్ల మంది అక్రమ చొరబాటు దారులుంటే వారి వివరాలను ప్రజల ముందు పెట్టాలి. ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం, చిరునామా మారడం, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం విదేశీయులుగా నిర్ధారించడానికి ప్రాతిపదిక ఎలా అవుతుంది? వలస కార్మికులు, పేదలు, మైనారిటీలు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి ఆధారాలు చూపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అమిత్‌షా చెప్పిన లెక్కల్లోనూ స్పష్టత లేదు.
ఒకవైపు మూడు కోట్ల మందిని చొరబాటు దారులుగా చెబుతూనే మరోవైపు 2.8 నుంచి మూడు కోట్ల మంది మరణిం చారని, 6.15 కోట్ల మంది వలస వెళ్లారని, కోటి మంది పేర్లు డూప్లికేట్ అని వివరి స్తున్నారు. ఈ లెక్కలన్నింటికీ సంబంధం ఏమిటో, వాస్తవంగా ఎంత మంది అక్రమ విదేశీయులో స్పష్టం చేయాలి. బీహార్‌లో సుమారు 65 లక్షల మంది పేర్లు ముసా యిదా ఓటర్ల జాబితా నుంచి తొల గించడంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, తొలగింపునకు కారణాలతో కూడిన జాబితాను బహిరంగంగా అందించాలని ఆదేశించింది. ఆధార్‌ను గుర్తింపు పత్రంగా పరిగణించాలని కూడా స్పష్టం చేసింది. పశ్చిమబెంగాల్లో ఎస్ఐఆర్ అనంతరం 27.16 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించగా, వారిలో 22.21 లక్షల మంది తిరిగి చేర్చాలని అప్పీల్ చేసుకోవడం ప్రక్రియలోని లోపాల తీవ్రతను తెలియజేస్తోంది. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన పౌరుల హక్కులు దెబ్బతింటుంటే ప్రశ్నించకూడదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోంది.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్న వారిని దేశ వ్యతిరేకులుగా, చొరబాటుదారుల అనుకూలురుగా ముద్రవేస్తోంది.
బీజేపీ హైదరాబాద్ సభ వెనుక మరో రాజకీయ లక్ష్యం కూడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యా మ్నాయంగా ఎదగాలన్న తపనతో రాష్ట్ర రాజకీయాలను మతపరమైన విభజన దిశగా నడిపిం చాలనుకుంటోంది. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించే సందర్భంలోనూ హిందూ-ముస్లింల మధ్య ఘర్షణగా చిత్రించే ప్రయత్నాలు జరిగాయి. చారిత్రక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మత విద్వేషాలకు ఆయుధంగా మార్చడం ప్రమాదకరం. ఈ పోరాటంలో అన్ని మతాల ప్రజలు, కమ్యూనిస్టులు చేసిన త్యాగాలను విస్మరించి చరిత్రను ఒక మతానికి పరిమితం చేయలేరు. ఇప్పుడు చొరబాటుదారుల పేరుతో అదే విభజన రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సవాలును రాజకీయంగా ఎదుర్కోవాలి.
బీజేపీ విమర్శలకు ప్రతివిమర్శలతో సరిపెట్ట కుండా ఓటు హక్కు, మతసామరస్యం, రాజ్యాంగ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించాలి.
బీజేపీ తన పాదయాత్రకు ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి- అరాచకాన్ని తొలగించండి’ అని నినాదం ఇచ్చింది. కానీ ఎన్నికల సంఘం స్వతంత్రతపై అనుమానాలు, ఓటర్ల తొలగింపుపై ఆందోళనలు, నిరసనలకు ఆంక్షలు, ప్రశ్నించే గొంతులపై దాడులు జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యానికి ముప్పు తెస్తున్నదెవరు? అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించడమే అరాచకమా? ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రభావం నుంచి స్వతంత్రంగా పనిచేయాలని కోరడం ప్రజాస్వామ్య వ్యతిరేకమా? ప్రజల ఓటు హక్కును కాపాడాలని కోరుతున్న ప్రతిపక్షాలపై దాడి చేయడం ద్వారా ఈ ప్రశ్నల నుంచి తప్పించుకోలేదు. దేశం గమనిస్తోంది.
Just like the "Thief! Thief!" scenario!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 03, 2026 | 3 నిమిషాల చదవడం






కామెంట్లు (0)