రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా సవరణ
రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై ప్రతిపాదిత
టారిఫ్‌లలో కీలక సవరణలు భారత్, చైనా సహా పలు దేశాలపై 500 శాతం బదులు 100 శాతం సుంకాల ప్రతిపాదన
వాషింగ్టన్ : రష్యా నుంచి చమురు, సహజ వాయువును భారీగా కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలకు అమెరికా ఊరటనిచ్చింది. రష్యాపై మరిన్ని కఠిన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధం చేసిన ఒక సంచలన బిల్లును సవరించారు. గతంలో ప్రతిపాదించిన 500 శాతం భారీ సుంకాల స్థానంలో గరిష్ఠ సుంకాన్ని 100శాతానికి తగ్గిస్తూ సవరించిన బిల్లును రిపబ్లికన్, డెమొక్రాట్ సెనేటర్లు ప్రవేశపెట్టారు. రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడం, అదే సమయంలో ప్రపంచ ఇంధన విపణి కుప్పకూలకుండా సమతుల్యం చేయడం కోసం ట్రంప్ యంత్రాంగంతో జరిపిన చర్చల తర్వాత సెనేటర్లు ఈ మార్పులు చేశారు.
500 శాతం నుంచి 100 శాతానికి తగ్గింపు
‘శాంక్షనింగ్ రష్యా యాక్ట్’ బిల్లును ఇటీవల మరణించిన అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహమ్ ప్రతిపాదించారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై అమెరికా అధ్యక్షుడికి అసాధారణ స్థాయిలో సుంకాలు విధించే అధికారాన్ని కల్పించేలా బిల్లును రూపొందించారు. తొలుత గరిష్ఠంగా 500 శాతం టారిఫ్‌లు విధించాలని ప్రతిపాదించగా, తాజా సవరణలతో వాటిని 100 శాతానికి పరిమితం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంధన మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్, చైనా పేర్లు ప్రస్తావన
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగడానికి రష్యా చమురు కొనుగోళ్ల ద్వారా భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు పరోక్షంగా ఆర్థిక వనరులు అందిస్తున్నాయని లిండ్సే గ్రాహమ్ గతంలో ఆరోపించారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే ఆయా దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు సిద్ధమంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాటలు చెబుతున్నప్పటికీ, దాడులు మాత్రం కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే సవరించిన బిల్లు అమల్లోకి వస్తే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, స్లోవేకియా, హంగరీ, అజర్‌బైజాన్ వంటి దేశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
కొన్ని దేశాలకు మినహాయింపులు
కాగా రష్యా సహజ వాయువుపై ఆధారాన్ని తగ్గించే చర్యలు చేపడుతున్న కొన్ని దేశాలకు బిల్లులో మినహాయింపులు కల్పించారు. రష్యా సహజ వాయువును దిగుమతి చేసుకునే ప్రధాన దేశాల్లో చైనా, ఫ్రాన్స్, జపాన్, హంగరీ, బెల్జియం ఉన్నాయి. అయితే రష్యా గ్యాస్ దిగుమతులను క్రమంగా తగ్గిస్తున్న, మొత్తం సరఫరాలో 15 శాతం కంటే తక్కువపై ఆధారపడుతున్న దేశాలకు మినహాయింపులు ఇవ్వాలని బిల్లులో ప్రతిపాదించారు. దీంతో జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు కొంత ఊరట లభించనుంది.
ముడిచమురు మార్కెట్‌పై ప్రభావం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేందుకు గతంలో అమెరికా రష్యా చమురుపై కొన్ని మినహాయింపులు ఇచ్చింది. అయితే తాజా బిల్లుతో ఆ మినహాయింపులను పునఃసమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా చేపడుతున్న చర్యల్లో ఈ బిల్లు కీలకంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పెంటగాన్ బిల్లుకు డెమొక్రాట్ల అడ్డుకట్ట
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ఎదురుదెబ్బ తగిలింది. 1.15 ట్రిలియన్ డాలర్ల పెంటగాన్ విధాన బిల్లును అమెరికా సెనేట్ డెమొక్రాట్లు అడ్డుకున్నారు. ఇరాన్‌పై అమెరికా చేపడుతున్న సైనిక చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకునట్లు వారు తెలిపారు. జాతీయ రక్షణ అధికార చట్టం (NDAA) సెనేట్‌లో తదుపరి దశకు వెళ్లేందుకు అవసరమైన 60 ఓట్లు రాకపోవడంతో విధానపరమైన ఓటింగ్ 50-46తో ముగిసింది. ఓటింగ్‌లో పాల్గొన్న డెమొక్రాట్లందరూ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో ట్రంప్ ప్రతిపాదించిన రికార్డు స్థాయి రక్షణ బిల్లు నిలిచిపోయింది.
ఇరాన్ అంశమే ప్రధాన వివాదం
ఇరాన్‌పై అమెరికా చేపడుతున్న సైనిక చర్యల విషయంలో అధ్యక్షుడి అధికారాలకు మరింత నియంత్రణలు లేకుండా పెంటగాన్ బిల్లుకు మద్దతు ఇవ్వబోమని డెమొక్రాట్లు స్పష్టం చేశారు. మరోవైపు రిపబ్లికన్లు మాత్రం బిల్లును అడ్డుకోవడం జాతీయ భద్రతను రాజకీయాలకు బలిచేయడమేనని విమర్శించారు. దీనిపై సెనేట్ మైనారిటీ నేత చక్ షుమర్ మాట్లాడుతూ, “ఇరాన్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యానికి ఎన్‌డీఏఏ అనుమతి పత్రంగా మారకూడదు” అని వ్యాఖ్యానించారు.



