కుక్కను చంపాలనుకున్నప్పుడు దానిపై మోపే నెపం పిచ్చి. ఢిల్లీ ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నోట దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో హఠాత్తుగా ‘దిమాగీ నక్సల్స్’ కూడా సదరు ‘పిచ్చి’ సాకు కిందికే వస్తుంది. తమను ప్రశ్నించే వారి గొంతులను నొక్కేసేందుకు ఎంచుకున్న ఎత్తుగా కనిపిస్తుంది. ఈ అంచనా గత పన్నెండేళ్ల బీజేపీ పాలనలో దేశం చవి చూసిన అనుభవాల నుంచి వస్తుంది. అడవుల్లోని సాయుధ నక్సలైట్లను నిర్మూలించడంలో విజయం సాధించిన ప్పటికీ, మావోయిస్టు భావజాలం కలిగిన వారు సమాజంలో పాతుకుపోయి ఉన్నారని, వారే దేశానికి కొత్త శత్రువులని, అటువంటి వారితోనే ముప్పు పొంచి ఉందని ప్రధాని పేర్కొనడం వెనుక అణచివేత ప్రణాళికకు రూపకల్పన జరుగు తోందన్న అనుమానాలు బయలు దేరాయి. అక్కడితో ఆగకుండా దిమాగీలను గుర్తించి ఏకాకులను చేయాలనీ ప్రధాని అన్నారు. ఇప్పటివ రకు మోడీ, ఆయన పార్టీ బీజేపీ పలు సందర్భాల్లో ప్రతిపక్షాలను, ప్రజా ఉద్యమకారులను, పౌర హక్కుల కార్యకర్త లను, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించే వారిని, నిరసన తెలిపే వారిపై అనేకానేక అభియోగాలు మోపు తున్నారు. దేశద్రోహులు, జాతి వ్యతిరే కులు, ఆటంక వాదులు, ఉగ్ర వాదులు, తీవ్రవాదులు, మావో యిస్టులు అనే ముద్ర వేసి కేసులతో వేధించి నానా ఇబ్బందులు పెడుతు న్నారు. ఇంకో అడుగు ముందుకేసి ప్రభుత్వాన్ని పార్ల మెంట్‌లో, వెలుపల నిరసన తెలిపిన ప్రతిపక్ష నేతలను అర్బన్ నక్సల్స్ అని సంభోధించారు. ఈ పూర్వరంగంలో ఏకంగా దిమాగీ నక్సల్స్ అనే వరకు వెళ్లారంటే కచ్చితంగా నిరంకుశ ఎజెండా దాగి ఉంటుందన్నది స్పష్టం.
ప్రధాని ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తడంతో నష్ట నివారణకు ప్రభుత్వం తరఫున న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇచ్చిన వివరణ మరిన్ని సందేహాలను రేపింది. మావోయి స్టులకు మద్దతిచ్చేవారు, వేర్పాటు వాదులు, భారత రాజ్యాంగాన్ని తిరస్కరించే వారు, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించే వారే దిమాగీ నక్సల్స్‌గా చెప్పుకొచ్చారు. అయితే ఈ ఆర్టికల్‌ను వ్యతిరేకించే వారందరూ మేధో నక్సలైట్ల యితే ప్రతి పక్షాలు దిమాగీ నక్సల్స్ అవుతారా? వాస్తవానికి అంబేద్కర్ రచించిన రాజ్యాం గాన్ని తిరస్క రించింది బీజేపీ మాతృక ఆరెస్సెస్, పరివారం. చెప్పాల్సి వస్తే ఆ సంస్థలే జాతి విద్రోహులవుతాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చాక, ఆ పార్టీ పాలిత రాష్ట్రాలలో రాజ్యం అసహనం అనేక మార్లు బయట పడింది. ఉపా, రాజద్రోహం, వంటి అనేక తీవ్రాతి తీవ్రమైన కేసులను, నిర్బం ధాలను హక్కుల కార్యకర్తలు, ప్రజా ఉద్యమ కారులు, ప్రొఫెసర్లు, మేధావులు, కవులు, కళాకారులు ఎదుర్కొన్నారు. కొరేగావ్ కేసు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
హిందూ ఉన్మాదుల చేతుల్లో పన్సారే, దబోల్కర్, కల్బుర్గి, గౌరీ లంకేశ్ వంటి వారు హత్యకు గురయ్యారు. మరెందరో దాడులను చవిచూశారు.జెన్-జీ ఆందోళనలతో దిమ్మ తిరిగిన మోడీ ప్రభుత్వం, భవిష్యత్తులో ఇటువంటి పోరాటాలపై ఉక్కుపాదం మోపేందుకు సౌకర్యవంతమైన ‘దిమాగీ నక్సల్స్’ అనే పదాన్ని కనిపెట్టినట్లు విదితమవుతుంది. పౌర స్వేచ్ఛకు సంకెళ్లుగా చూడాలి. ప్రభుత్వ నిరంకుశ చర్యలను రాజ్యాంగ ప్రేమికులు, ప్రజాస్వామిక వాదులు, పార్టీలు, ప్రతి ఒక్కరూ ఖండించాలి.
‘దిమాగీ నక్సల్స్’ అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ పరిహాసానికి కూడా దారితీశాయి. ఇప్పటికే యువతలో వ్యంగ్యంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వంటి పేర్లు వినిపిస్తుండగా, తాజాగా ‘దిమాగీ నక్సల్ పార్టీ’ పేరుతో సోషల్ మీడియాలో కొత్త రాజకీయ వ్యంగ్య వేదిక తెరపైకి వచ్చింది. అంటే, పాలకులు విమర్శకులకు పెట్టిన ముద్రలే తిరిగి పాల కులపై వ్యంగ్యాస్త్రాలుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని విమర్శించిన వారిని ‘దిమాగీ నక్సల్స్’గా ముద్రించే ధోరణి కొనసాగితే రేపటి ప్రజాస్వామిక అసమ్మతికి ఎలాంటి పేరు పెడతారన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పాలక వ్యవస్థ, ప్రశ్నించే ప్రజలకే కొత్త కొత్త ముద్రలు వేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. పాలకులు ప్రజల అసమ్మతిని అణచడం కంటే వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడం ముఖ్యం. వారు జవాబు చెప్పనంత కాలం ‘కాక్రోచ్’ అయినా, ‘దిమాగీ’ అయినా పేర్లు మారుతాయి కానీ, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు మాత్రం శాశ్వతం.
ప్రశ్నపై కొత్త కుట్ర!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



