Friday, August 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమళ్లీ ఎజెండాలోకి జవాబుదారీతనం

మళ్లీ ఎజెండాలోకి జవాబుదారీతనం

- Advertisement -

పార్లమెంటు సమావేశాల ముగింపునకు ముందు రోజు చాలా విడ్డూరమైన పరిస్థితి. సర్వశక్తివంతుడైన హోంశాఖామాత్యులు అమిత్‌‌ షా మీడియా ఛానళ్లలో మాట్లాడే ముందు నిస్సహాయంగా వాపోయారు. లోక్‌‌సభకు వెళ్లడంలో అర్థమేముంది అని విషాద స్వరంతో ప్రశ్నిస్తున్నారు. సందర్భవశాత్తూ ఇక్కడో మాట చెప్పాలి. మొత్తం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చెప్పుకోదగిన కార్యక్రమాలేవీ నిర్వహించకుండానే తుడిచిపెట్టుకుపోయాయి. జులై 20న జంతర్‌ ‌మంతర్‌ వద్ద శాంతియుత నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించి అమిత్‌ ‌షా సభకు వచ్చి ఒక వివరణ ఇవ్వడానికి నిరాకరించడమే ఇందుకు కారణం.

ఒక శాంతియుత నిరసన సాగుతుంటే ఢిల్లీ పోలీసులు అత్యంత పాశవికంగా వ్యవహరించారు. విచక్షణా రహితంగా బాష్పవాయు ప్రయోగం చేశారు. సాదా దుస్తుల్లో వచ్చిన పోలీసులు తమ నామఫలకాలు కూడా లేకుండా చొరబడి విషపూరితమైన లాఠీచార్జికి పాల్పడ్డమేగాక ముండ్ల బెత్తాలు కూడా ఉపయోగించారు. మహిళల మర్మాంగాలపై దాడి చేశారు. పెల్లెట్‌ ‌తుపాకులు ఉపయోగించారు. ట్రక్కుల కొద్దీ రాళ్లు తీసుకొచ్చి నిలిపారు. తర్వాత వాటిని చూపించి విద్యార్థులే హింసాకాండకు పాల్పడినట్టు చిత్రించాలనుకున్నారు. ఈ మాయోపాయాలలో ప్రతి ఒకదానికీ ఆధారాలతో సహా తర్వాత కన్నంలోనే దొరికిపోయారు. సరే కొత్తగా నియోగించినవేమంటే ఎలక్ర్టానిక్‌ ‌డ్రాగ్నెట్లు. వాటి సాయంతో నిరసనకారుల గుర్తింపును డిజిటల్‌‌గా రికార్డు చేసి అట్టిపెట్టాలని చూశారు. ఈ ఆయుధాలలో దేనికీ చట్టబద్దమైన ఆమోదం లేదనేది వేరే విషయం. కనుక అమిత్‌ ‌షా పరిస్థితి ‘ముందు నుయ్యి వెనక గొయ్యి’ అన్నట్టు తయారైందనేది స్పష్టం. మొదటగా తనను హోంమంత్రిగా నియమించడానికి లోక్‌‌సభనే కారణమన్నది ఆయన మర్చిపోయారు. కనుక ఆయన సభకు జవాబు చెప్పవలసిన బాధ్యత నుంచి తప్పించుకోలేరు. జులై 20న ఆ తర్వాత విద్యార్థుల పట్ల అంత అమానుషంగా ప్రవర్తించడానికి బాధ్యులెవరనేదానిపై సభకు సమాచారం అందించి తెలియపర్చాల్సిన బాధ్యత తనదే.

మోడీనే ఒప్పుకున్న వాస్తవం
విషయాలు అటూ ఇటూ తిప్పేసి పోలీసు చర్యకు నిజంగా బాధ్యులెవరనే ప్రశ్నకు జవాబు చెప్పకుండా దాటేసే స్వేచ్ఛ ఆయనకు వుండదు. ఇది ఈయనకో రివాజుగా మారిపోయింది. 2025 ఏప్రిల్‌ 22న దురదృష్టకరమైన ఆ మధ్యాహ్నం ట్రెరరిస్టులెలా చొరబడి 28 మంది అమాయకులను బలి తీసుకోగలిగారనే దానికి కూడా ఇలాగే ఆయన జవాబు దాటేశారు. ఇప్పటికీ దానికి జవాబుల కోసం బతిమాలుకోవలసిన పరిస్థితే కొనసాగుతున్నది. ఇప్పుడు వాతా వరణం మారిపోయింది. ఆయన జవాబుదారీతనం చూపించాల్సిన బాధ్యత మిగిలే వుంది. కానీ సర్కారు పూర్తి ఇరకాటంలో చిక్కుకుపోయి వుంది. సమాధానమిచ్చి మూల్యం చెల్లించడమా లేక జవాబుదారీతనం కోసం ఒత్తిడి పెరిగినా కూడా మౌనం పాటించి బయిటపడటమా అనే పరిస్థితి. ఈ విషయంలో బాధ్యత నుంచి తప్పుకోవడం సాధ్యం కాదనడానికి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌బలవంతంగా రాజీనామా చేయవలసి రావడమే ఒక ఒప్పుకోలు. అయితే నీట్‌ ‌రద్దుపై నివేదిక గనక చూస్తే వాస్తవంగా మారిందేమీ లేదని అర్థమవుతుంది. నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్‌‌టిఎ)ను రద్దు చేసేవరకూ పరీక్షల నిర్వహణలో ఈ విపరీత కేంద్రీకరణ దెబ్బతినడం అనివార్యం. విద్యార్థి శిక్షణ లేకుండా ప్రవేశ ప్రక్రియ, అర్హత పరీక్షను ఎదుర్కోలేని పరిస్థితి మారకుండా పాఠశాల వ్యవస్థ మెరుగుపడబోదని మోడీనే స్వయంగా అంగీకరించవలసి వచ్చింది. ఎర్రకోట పైనుంచి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఆయనీ మాట ఒప్పుకున్నారు. దేశవ్యాపితంగా దాదాపు 94,000 స్కూళ్లు మూతపడ్డాయని ప్రభుత్వం అధికారికంగా ఒప్పుకోవలసి వచ్చిన పరిస్థితిని ఎవరు ఖండించగలరు? ఈ మూసివేత అన్నది వ్యవస్థను పటిష్టపరిచే క్రమంలో ఒక భాగమని జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపి) వాదించింది. ఎన్‌ఇపి అమలు మొదలై ఇప్పుడు ఏడో సంవత్సరం. అయినా అదనపు శిక్షణ లేకుండా విద్యార్థుల ఫలితాలు వాటికవే నిరూపించుకోవడం సాధ్యపడటం లేదు. ఈలోగా సుప్రీంకోర్టు స్వయంగా రంగంలోకి దిగి జులై 20 పోలీసు హింసాకాండపై సంజాయిషీ కోరవలసి వచ్చింది. ఇదేవిధంగా ప్రతి శాంతియుత నిరసనను నేరపూరితంగా చూపించే మోడీ సర్కారు రివాజు ఇంకేమాత్రం తుడిచిపారేయలేని పరిస్థితి వచ్చేసింది.

భయం అన్నది వెనక్కుపోయి సామూహిక సాహసంతో నిలబడే వాతావరణంలో కొత్త గాలులు ఊపిరి పోసుకోవడం సంతోషకరమైన పరిణామం. కేవలం సర్కారీ యంత్రాంగానికేగాక న్యాయ వ్యవస్థకు కూడా సెగ తగిలింది. తమ యాజ మాన్యం భారత ప్రధాన న్యాయమూర్తికి ఆహ్వానం పంపడాన్ని నల్సార్‌ ‌విద్యార్థులు బహిరంగంగా నిరసించారు. మొదటైతే ఏదో మిన్ను విరిగిపడినట్టు స్పందించారు! కానీ తర్వాత మరో జాతీయ న్యాయ విద్యాలయ విద్యార్థులు కూడా అదే విధమైన నిరసనను పునరావృతం చేశారు. పాలక పార్టీ హంగుదారుడు బార్‌ ‌కౌన్సిల్‌ అధ్యక్షుడైన రాజ్యసభ ఎంపీ ఒకరు నల్సార్‌ ‌విద్యార్థులపై శిక్షా చర్య తీసుకుంటామని బెదిరించడంతో అన్ని వైపుల నుంచి విమర్శ వెల్లువెత్తింది. చివరకు మీరెందుకు అనవసరంగా తలదూర్చారని సిజెఐ స్వయంగా బిసిఐ అధ్యక్షుడిని మందలించవలసి వచ్చింది. బీజేపీ నాయకత్వం తోక ముడవాల్సి వచ్చింది. బిసిఐ అధ్యక్షుడిని మందలించే సందర్భంలోనే సిజెఐ యువత అయినా, వృద్ధులైనా నిరసన అన్నది పౌరులకున్న అవిభాజ్యమైన హక్కు అని వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టిలో న్యాయ వ్యవస్థ గనక విశ్వసనీయత, సమగ్రత, నిష్పాక్షికత కోల్పోతే దానికి విలువే వుండదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి మరొకరు సూటిగా చెప్పవలసి వచ్చింది. నేరుగా ప్రజలతో ఎన్నుకోబడనప్పటికీ రాజ్యాంగం ఉద్దేశించినట్టు అది ప్రజలకు జవాబుదారీగా వుండాలనే భావన న్యాయ వ్యవస్థలో ఉదయిస్తున్నది.

కండ్లు తెరవని ఈసిఐ
ఏమైనా ఇప్పటికీ కండ్లు తెరవని ఒక రాజ్యాంగ వ్యవస్థ భారత ఎన్నికల కమిషన్‌. ప్రధాన మీడియాలో ప్రత్యేకించి చర్చనీయాంశంగా లేకున్నా సర్‌ ప్రక్రియ నివేదికలు మాత్రం వెలువడుతూనే వున్నాయి. సాఫ్ట్‌‌వేర్‌‌నూ అల్గోరిథమ్‌‌లను ఏ మాత్రం అంతుపట్టని రీతిలో ఉపయోగించడం వల్ల ఓటర్ల జాబితాల నుంచి పేర్లు ఎలా తొలగించబడుతున్నాయో చెబుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఇంత అలవోకగా లాగిపారేయడం ఏ విధంగానూ జవాబు దారీతనం కాదు. కనుక తమ రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం ప్రజలు నిలదొక్కుకోవడం, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థల నుంచి జవాబుదారీతనం కోరుతున్న కొత్త వాతావరణం ఇప్పుడు ఏర్పడింది. అందువల్ల ఇప్పుడు ఈసిఐ జవాబుదారీతనం వుండాలనే డిమాండు కూడా ప్రతిధ్వనించబోతున్నది. డోనాల్డ్‌ ‌ట్రంప్‌ ‌కితాబునిస్తే ఈ ఒత్తిడి ఆగిపోదు.
పారదర్శకత, ఇతోధిక జవాబుదారీతనం కలిగిన వ్యవస్థ దిశగా మనం సాగిపోదాం. మన ప్రజాస్వామ్యానికి, అదే జీవరేఖ అవుతుంది. రాజ్యాంగ అమరికకు రక్షణగా నిలుస్తుంది.
(ఆగష్టు 19 ‘పీపుల్స్‌‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -