Saturday, August 15, 2026
E-PAPER
Homeఖమ్మంఅంబేడ్కర్ విగ్రహం సమానత్వానికి ప్రతీక: ఎమ్మెల్యే జారే

అంబేడ్కర్ విగ్రహం సమానత్వానికి ప్రతీక: ఎమ్మెల్యే జారే

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మూడు రోడ్ల ప్రధాన కూడలిలో పునర్నిర్మించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ విగ్రహం సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. పేద కుటుంబాలకు ఆశాజ్యోతిగా, యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు.

కుల వివక్షను చిన్నతనంలోనే ఎదుర్కొన్న అంబేడ్కర్‌ విద్యను ఆయుధంగా చేసుకుని ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందారని అన్నారు. పుట్టుక మన చేతుల్లో లేకపోయినా జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉందనే సందేశాన్ని ఆయన జీవితం అందిస్తుందన్నారు. ఆర్థికశాస్త్రం, రాజకీయశాస్త్రం, న్యాయశాస్త్రం, చరిత్ర తదితర రంగాల్లో అంబేడ్కర్‌ విశేష పాండిత్యం సాధించారని తెలిపారు.

అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన అంబేడ్కర్‌ ప్రతి మనిషికి గౌరవంగా జీవించే హక్కు ఉందని చాటిచెప్పారని అన్నారు. భారత రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అందించినందుకే ఆయనను భారత ప్రజాస్వామ్య శిల్పిగా గౌరవిస్తున్నామని చెప్పారు. యువత అంబేడ్కర్‌ జీవితాన్ని అధ్యయనం చేసి, రాజ్యాంగ స్ఫూర్తిని తెలుసుకుని విద్యను ఆయుధంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జూపల్లి శశికళ, వైస్‌ చైర్మన్‌ జూపల్లి రమేష్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ సుంకవల్లి వీరభద్రం, అంబేడ్కర్‌ కమిటీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -