ఆ దేశ అగ్రశ్రేణి యుద్ధనౌకలో భారీ అగ్ని ప్రమాదం ‘యూఎస్‌ఎస్ జెరాల్డ్ ఆర్.ఫోర్డ్’లో తీవ్ర నష్టం]
సీఎన్‌ఎన్‌కు లభించిన బహిర్గతం
ఈ ఏడాది మార్చిలో ఘటన
వాషింగ్టన్ : ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యాధునిక అణుశక్తి విమాన వాహక యుద్ధనౌకగా చెప్పబడే ‘యూఎస్‌ఎస్ జెరాల్డ్ ఆర్.ఫోర్డ్’లో ఈ ఏడాది మార్చిలో సంభవించిన అగ్ని ప్రమాదం అమెరికా నౌకాదళం వెల్లడించిన దాని కంటే చాలా తీవ్రంగా ఉన్నట్టు తాజగా బయటపడిన వీడియోలు సూచిస్తున్నాయి. అగ్నిమాపక వ్యవస్థ విఫలమవడంతో నావికులు ప్రాణాలను పణంగా పెట్టి మంటలను అదుపులోకి తెచ్చారనీ, నౌకలోని కొన్ని విభాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని సీఎన్‌ఎన్ ప్రత్యేక కథనం వెల్లడించింది.
విఫలమైన అగ్నిమాపక వ్యవస్థ
నౌకలో ఏర్పాటు చేసిన స్వయంచాలక అగ్నిమాపక వ్యవస్థ పని చేయలేదని ఒక నావికుడు, అలాగే ఘటనపై అవగాహన ఉన్న ఓ సీనియర్ అమెరికా అధికారి వెల్లడించారు. సాధారణంగా ఆ వ్యవస్థ మంటలను ప్రారంభ దశలోనే ఆర్పేయాల్సి ఉండగా.. అది పని చేయకపోవడంతతో నావికులే ప్రత్యక్షంగా మంటలను అదుపు చేయాల్సి వచ్చింది. మంటలను పూర్తిగా ఆర్పడం, శుభ్రపర్చడం, మళ్లీ చెలరేగకుండా నిరోధించడం కోసం సిబ్బందికి సుమారు 30 గంటల సమయం పట్టింది. అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు 600 మంది నావికులు తమ నివాస వసతులను కోల్పోయారు. కాగా ఇరాన్‌పై యుద్ధం చర్యల నడుమ ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. అగ్నిప్రమాదం మాత్రమే కాకుండా.. నౌక పలు సాంకేతిక సమస్యలను కూడా ఎదుర్కొంది. నౌకలోని మరుగుదొడ్లు తరచూ మూసుకుపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పని చేసే టాయిలెట్ కోసం నౌక మరో చివరికి వెళ్లాల్సి వచ్చేదని నావికులు తెలిపారు.
అమెరికా నౌకాదళానికి ప్రతీక
2017లో సేవల్లోకి వచ్చిన యూఎస్‌ఎస్ జెరాల్డ్ ఆర్.ఫోర్డ్ అమెరికా నౌకా దళంలోని అత్యాధునిక విమాన వాహక నౌక. సుమారు 13 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ నౌక.. అణుశక్తితో నడుస్తుంది. దీనిలోని ఎలక్ట్రానిక్ క్యాటపల్ట్ వ్యవస్థ చిన్న డ్రోన్ల నుంచి భారీ యుద్ధ విమానాల వరకు ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అమెరికా వద్ద ఉన్న మిగతా పది విమాన వాహక నౌకల్లో ఈ సాంకేతికత లేదు.
ఏడాది పాటు మరమ్మతులు
11నెలల సుదీర్ఘ మోహరింపును ముగించుకొని మేలో వర్జీనియాలోని నార్పోక్‌నకు చేరుకున్న ఈ యుద్ధనౌకకు ప్రస్తుతం విస్తృత మరమ్మతులు అవసరమయ్యాయి. అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టంతో పాటు.. దీర్ఘకాలిక వినియోగం కారణంగా ఏర్పడిన సమస్యలను కూడా సరి చేయాల్సి ఉంది. దీంతో ఫోర్డ్ మళ్లీ సముద్రయాత్రకు సిద్ధం కావడానికి కనీసం ఒక ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు.
నష్టాన్ని దాచిపెట్టారా?
మార్చిలో జరిగిన అగ్ని ప్రమాదం అనంతరం అమెరికా నౌకాదళం విడుదల చేసిన ప్రకటనలో మంటలు అదుపులోకి వచ్చాయనీ, ఇద్దరు నావికులకు స్వల్ప గాయాలయ్యాయని, నౌక పూర్తి కార్యకలాపాలకు సిద్ధంగా ఉందని తెలిపింది. అయితే తాజాగా సీఎన్‌ఎన్‌కు లభించిన వీడియోల్లో నౌకలోని సిబ్బంది నివాస విభాగాలు పూర్తిగా కాలిపోయిన దృశ్యాలు కనిపించాయి. నావికులు నిద్రించే బెడ్లు, బూడిదా మారగా, పైకప్పులు దెబ్బతిన్నాయి. విద్యుత్ వైర్లు వేలాడుతూ, చుట్టూ బూడిద పేరుకుపోయిన దృశ్యాలు వీడియోలో నమోదయ్యాయి.
‘నౌకను కోల్పోతామనుకున్నాం’
అగ్ని ప్రమాదాన్ని ఎదుర్కొన్న ఓ నావికుడు సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ.. పరిస్థితి ఎంత భయానకంగా ఉందో వివరించాడు. ”మేము నౌకను కోల్పోతామని అనుకున్నాం. పోరాడటమో లేదా చనిపోవడమో అనే పరిస్థితి ఎదురైంది” అని ఆయన తెలిపాడు.


