లక్షలాది మందితో భారీ ర్యాలీలు
వెయ్యి మందికి పైగా అరెస్ట్
పారిస్ : నిరసన ప్రదర్శనలతో ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శనివారం నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల మందికి పైగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ర్యాలీలు నిర్వహించారు. వీటిలో చాలా వరకూ శాంతియుతంగానే జరిగాయి. రాజధాని పారిస్‌లో జరిగిన ప్రదర్శనలోనే లక్ష మందికి పైగా పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలని, యువ కార్మికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని, పెరుగుతున్న జీవనవ్యయాన్ని అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు, కార్మిక సంఘాలు, ఎల్లో వెస్ట్స్ బృందాలు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్నాయి. పారిస్, లియాన్, మార్సెయిల్, లిల్లే, నాంటెస్ వంటి ప్రధాన నగరాల్లో నిరసనలు ఉధ తంగా సాగాయి. పలు చోట్ల ఆందోళనకారులు బారికేడ్లను తగలబెట్టగా వారిని చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయు గోళాలు, నీటి ఫిరంగులను ఉపయోగించారు. వివిధ ప్రాంతాల్లో వెయ్యి మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేసినట్లు ఆంతరంగిక వ్యవహారాల మంత్రి లారెంట్ నూనెజ్ తెలియజేశారు. గత వారం జరిగిన నిరసన ప్రదర్శనల సందర్భంగా కేవలం 385 మందిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో పారిస్‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్, లువ్రే మ్యూజియం వంటి పర్యాటక ప్రాంతాలను, అనేక షాపులు, రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేశారు. కొన్ని నగరాల్లో రాత్రి సమయంలో కర్ఫ్యూలు, నిషేధాజ్ఞలు విధించారు.
ఆందోళనకారులు హింసకు తెగబడకుండా పోలీసులు ఎక్కడికక్కడ నియంత్రించారని నూనెజ్ చెప్పారు. కొన్ని నగరాల్లో చాలా పరిమిత సంఖ్యలోనే వ్యాపారాలకు కొంత నష్టం జరిగిందని, దుకాణాలను దోచుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. అయితే వారం క్రితం జరిగిన అల్లర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. గత వారం పోలీస్ స్టేషన్లు, టౌన్‌హాల్స్ వంటి ప్రభుత్వ భవనాలపై దాడులు జరగ్గా ఇప్పుడు అలాంటి ఘటనలేవీ జరగలేదు. కానీ రాళ్లు రువ్వడం, బాణసంచా కాల్చడం వంటి ఘటనలు భద్రతా దళాలను ఇబ్బంది పెట్టాయని నూనెజ్ అన్నారు.







కామెంట్‌లు (0)