ఇమ్మిగ్రేషన్ అణచివేత చర్యలను తీవ్రతరం చేసిన ట్రంప్ ప్రభుత్వం..
భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం : హక్కుల కార్యకర్తలు
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ప్రభుత్వం మూడు లక్షలకు పైగా యూఎస్ వీసాలను రద్దు చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 10వ తేదీన విదేశాంగ శాఖ విడుదల చేసిన నివేదికలో చెప్పిన సంఖ్య కంటే ఇది చాలా ఎక్కువగా ఉంది. ఆ నివేదిక ప్రకారం గత సంవత్సరం జనవరి నుంచి 1,75,000 వీసాలు రద్దయ్యాయి. దీనిని బట్టి చూస్తే గత కొన్ని వారాల వ్యవధిలో అమెరికాలో వీసాల రద్దు గణనీయంగా పెరిగిందని అర్థమవుతుంది. విస్త తమైన ఇమ్మిగ్రేషన్ అణచివేత చర్యలలో దీనిని ఒక భాగంగా విదేశాంగ ప్రతినిధి టామీ పిగాట్ అభివర్ణించారు. ‘మా ప్రభుత్వంతో పోలిస్తే ప్రపంచంలోని ఏ దేశపు ప్రభుత్వం కూడా ఇంత ఎక్కువ సంఖ్యలో వీసాలను రద్దు చేయలేదు’ అని ఆయన గొప్పగా చెప్పుకొచ్చారు.
హక్కుల కార్యకర్తల నిరసన
ట్రంప్ ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్ అణచివేత చర్యలను హక్కుల కార్యకర్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన చర్యలు చట్టబద్ధమైన ప్రక్రియను, భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నాయని ధ్వజమెత్తారు. ముఖ్యంగా జాతిపరమైన మైనారిటీల్లో అభద్రతా వాతావరణాన్ని సృ ష్టించాయని ఆందోళన వ్యక్తం చేశారు. గాజాపై అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న పాలస్తీనా అనుకూల విదేశీ ఆందోళనకారుల వీసాలను ప్రభుత్వం రద్దు చేస్తోంది. అలాగే సంప్రదాయవాద వ్యాఖ్యాత చార్లీ కిర్క్ హత్యపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన విదేశీయుల వీసాలు కూడా రద్దయ్యాయి. తాజాగా ప్రభుత్వ నిఘా, తనిఖీలు మరింత ముమ్మరమయ్యాయి. విదేశీ నిరసనకారులను దేశం నుంచి బహిష్కరించడంతో పాటు వలసదారులు, వీసా దరఖాస్తుదారుల కోసం సోషల్ మీడియా తనిఖీలను ప్రభుత్వం తీవ్రతరం చేసింది. జాతీయ భద్రత పేరిట విమర్శకులను వెంటాడి వేధిస్తున్నారు. మిన్నెసోటాలోని సోమాలీ అమెరికన్ కమ్యూనిటీ సహా వలసదారుల సమూహాలపై కేసులు పెడుతున్నారు. అక్రమ వలసలను అరికడతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ట్రంప్ కొన్ని వర్క్ వీసాలపై అధిక రుసుములు విధించి విదేశీయుల చట్టబద్ధ ప్రవేశాన్ని కఠినతరం చేస్తున్నారని హక్కుల కార్యకర్తలు మండిపడ్డారు.
సమర్ధించుకుంటున్న ప్రభుత్వం
న్యూయార్క్ పోస్ట్ పత్రిక కూడా ప్రభుత్వ కఠిన చర్యలపై కథనాలు అందించింది. బర్త్ టూరిజంలో పాల్గొన్నారని లేదా వారికి సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు సంబంధించిన నాలుగు వేలకు పైగా వీసాలు రద్దయ్యాయని ఆ పత్రిక తెలియజేసింది. అయితే నేర కార్యకలాపాలు, ప్రభుత్వ భద్రతకు ముప్పు, మోసం, తప్పుడు సమాచారం వంటి వలస నిబంధనల ఉల్లంఘనల కారణంగానే వీసాల రద్దు జరుగుతోందని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చారు. వీసాలు రద్దయిన విదేశీయుల జాతీయతకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు.
దేశ భద్రత కోసమేనట
వీసాలపై అమెరికాలో ఉంటూ చట్టాలను ఉల్లంఘిస్తూ, మోసాలకు పాల్పడుతూ లేదా జాతీయ భద్రతకు భంగం కలిగించే విదేశీయులను తమ ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించబోదని పిగాట్ స్పష్టం చేశారు. దేశ భద్రతను మెరుగుపరచడానికే ఇమ్మిగ్రేషన్ అణచివేత, దేశ బహిష్కరణ చర్యలు చేపట్టామని ట్రంప్ ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి వీసాల రద్దు ప్రక్రియ వేగం పుంజుకున్నదని చెప్పడానికి తాజా గణాంకాలే ఉదాహరణ. వీసా హోల్డర్లు, దరఖాస్తుదారులపై నిఘాను ప్రభుత్వం కఠినతరం చేసింది.






కామెంట్లు (0)