అడెన్ విమానాశ్రయంపై హౌతీల దాడి
సనా : సౌదీ అరేబియా మద్దతు ఉన్న యెమెన్ ప్రభుత్వ దళాలకు, ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలకు మధ్య పోరు రోజురోజుకూ తీవ్రమవుతోంది. యెమెన్‌లోని అడెన్ విమానాశ్రయంపై హౌతీలు బుధవారం క్షిపణి దాడి జరిపారు. ఈ విమానాశ్రయం హౌతీల నియంత్రణలో లేని యెమెన్ ప్రాంతాలకు ప్రధాన అంతర్జాతీయ ముఖద్వారంగా కొనసాగుతోంది. విమానాశ్రయంపై హౌతీలు రెండు క్షిపణులను ప్రయోగించారని, అయితే ఎలాంటి నష్టం జరగలేదని అడెన్ భద్రతా విభాగం కార్యాలయం తెలిపింది. దాడి కారణంగా జరిగిన పేలుళ్లకు సంబంధించిన వీడియో ఫుటేజీలను స్థానిక మీడియా సంస్థలు ప్రచురించాయి. యెమెన్‌కు చెందిన ఎర్ర సముద్ర తీరం వెంబడి హౌతీలు చొచ్చుకువస్తుండడంతో ప్రభుత్వ దళాలు వారిని ప్రతిఘటిస్తున్నాయి. హౌతీల అధీనంలో ఉన్న రాజధాని సనాను తిరిగి స్వాధీనం చేసు కునేందుకు, హౌతీల నియంత్రణలో ఉన్న ప్రభుత్వ సంస్థలను పునరుద్ధరించేందుకు 'డాన్ ఆఫ్ యెమెన్' పేరిట ఆపరేషన్ చేపట్టామని ప్రెసిడెన్షియల్ లీడర్‌షిప్ కౌన్సిల్ ఛైర్మన్ రషాద్ అల్-అలిమీ రెండు రోజుల క్రితం చెప్పారు. హౌతీలతో ఘర్షణల అనంతరం పశ్చిమ తయిజ్‌లోని కీలక పర్వత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వ దళాలు తెలి పాయి. బాబ్ అల్-మందెబ్ జలమార్గం సమీపంలోని ప్రాంతాలను సౌదీ వైమానిక దళ మద్దతుతో తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నామని చెప్పాయి. దక్షిణాన ఉన్న ఖమిస్ ముషాయిత్ నగరం వైపుగా హౌతీలు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకొని ధ్వంసం చేశామని సౌదీ, యెమెన్ సంకీర్ణ దళాలు బుధవారం ఉదయం తెలియజేశాయి. కాగా తాము సౌదీ అరేబియాపై కూడా దాడి చేశామని హౌతీలు పేర్కొన్నారు. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో అభా విమానాశ్రయాన్ని, డ్రోన్లతో రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని వివరించారు. కాగా హౌతీల నియంత్రణలో ఉన్న ఇబ్, తయిజ్ సెంట్రల్ గవర్నరేట్ ప్రాంతాలపై సౌదీ దళాలు దాడి చేశాయని హౌతీల అనుబంధ అల్ మసిరా టీవీ తెలిపింది.






కామెంట్‌లు (0)