Magazines

నిరసనలతో హోరెత్తిన ఫ్రాన్స్‌

1 గంట క్రితం

France
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 2 నిమిషాల చదవడం

లక్షలాది మందితో ర్యాలీలు
సంస్కరణల కోసం డిమాండ్‌

పలు చోట్ల ఘర్షణలు.. అరెస్టులు


పారిస్‌ : పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, విద్యా సంస్కరణలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఫ్రాన్స్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. పారిస్‌, లియోన్‌, మార్సెయిల్‌, స్ట్రాస్‌బర్గ్‌, టౌలౌస్‌ సహా పలు నగరాలలో ఆందోళనలు ఉధృతం కావడంతో పోలీసులు భాష్పవాయు గోళాలను, నీటి ఫిరంగులను ప్రయోగించారు. దేశవ్యాప్తంగా వందలాది పాఠశాలలు మూతపడ్డాయి. ఉత్తర ఫ్రాన్స్‌లోని లెన్స్‌ నగరంలో జరిగిన ఘర్షణల్లో పోలీస్‌ గ్రెనేడ్‌ పేలి పదిహేను సంవత్సరాల బాలుడు తన చేతిని కోల్పోయాడు. ఉద్రిక్తతల నేపథ్యంలో పాఠశాలల్లో తరగతులను ప్రధాని సెబాస్టియన్‌ లెకార్ను తాత్కాలికంగా నిలిపివేశారు. విద్యార్థుల ప్రదర్శనలను దశాబ్దాల చరిత్రలో అత్యంత హింసాత్మకమైనవిగా ఆయన అభివర్ణించారు. ఘర్షణల్లో ఇప్పటి వరకూ 215 మంది యువకులు, 85 మంది పాఠశాల సిబ్బంది, 700 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని చెప్పారు. కాగా ఫ్రాన్స్‌లో నిరసనలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ వివాదంగా మారాయి. ఇది కేవలం పాఠశాలల సమస్య కాదని, ఫ్రాన్స్‌లో వలసలపై నియంత్రణ తప్పడంతో ఇస్లాం ఆధిపత్యం కొనసాగుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. అయితే ఆందోళనలకు వలసలు లేదా మతంతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం పాఠశాలలకు నిధులు, ఉపాధ్యాయుల కొరత పైనే నిరసనలు జరుగుతున్నాయని విశ్లేషకులు స్పష్టం చేశారు.

ఫ్రాన్స్‌లో ఒక్క మంగళవారం నాడే నాలుగు లక్షల మందికి పైగా వీధుల్లోకి వచ్చి ర్యాలీలు నిర్వహించారు. 'ప్రభుత్వం జాతీయ విద్యను నాశనం చేసింది' అంటూ నినాదాలు చేశారు. రాజధాని పారిస్‌ నగరంలో 56 వేల మంది విద్యార్థులు ఆందోళనలో భాగస్వాములయ్యారు. దేశవ్యాప్తంగా 891 పాఠశాలలు మూతపడ్డాయి. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయి. మంగళవారం నాటి హింసాత్మక ఘటనల అనంతరం దేశవ్యాప్తంగా 488 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత వారం పారిస్‌ సమీపంలో జరిగిన పోలీస్‌ గ్రెనేడ్‌ దాడిలో 14 సంవత్సరాల విద్యార్థి దవడ ఎముక విరిగిన ఘటనపై విచారణ జరుగుతోంది. ఘటనకు కారకుడైన పోలీసు అధికారిపై అభియోగాలు నమోదు చేశారు. పాఠశాల విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రస్తుతం తల్లిదండ్రులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు, కార్మిక సంఘాలు సైతం ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యాయి. తమ డిమాండ్లు నెరవేరే వరకూ ఆందోళ నలను ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాల ప్రతి నిధులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా గురువారం మరిన్ని భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని ఫ్రాన్స్‌లో అతి పెద్ద కార్మిక సంఘమైన సీజీటీ తెలియజేసింది. అందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మరోవైపు పరిస్థితిని సమీక్షించేందుకు దేశాధ్యక్షుడు మాక్రాన్‌ ప్రధాని, ఇతర సీనియర్‌ అధికారులతో సమావేశమయ్యారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్