Magazines

అమెరికాలో గృహరుణాలపై పెరిగిన వడ్డీ రేటు

08 అక్టోబర్, 2026

Rise in interest rates
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

కొనుగోలుదారుల బేజారు

వాషింగ్టన్‌ : అమెరికాలో గృహ రుణాలపై వడ్డీ రేటు గత మూడు సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయికి పెరిగింది. దీనిపై గృహ కొనుగోలుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ గృహ రుణాల వడ్డీ రేటు పెరగడం రిపబ్లికన్ల విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నెల 2తో ముగిసిన వారంలో గృహ రుణాలపై సగటు 30 సంవత్సరాల స్థిర వడ్డీ రేటు 30 బేసిక్‌ పాయింట్లు పెరిగి 7.49 శాతానికి చేరుకున్నదని మార్టిగేజ్‌ బ్యాంకర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. 2023 నవంబర్‌ తర్వాత గృహ రుణాలపై వడ్డీ రేటు ఈ స్థాయికి పెరగడం ఇదే మొదటిసారి. రాబోయే మధ్యంతర ఎన్నికలలో జీవనవ్యయం ప్రధాన అంశం అవుతుందని ఇప్పటికే పలు పోల్స్‌ తెలియజేశాయి. ఫిబ్రవరిలో అమెరికా - ఇజ్రాయిల్‌ సేనలు ఇరాన్‌పై దాడులు చేసిన తర్వాత గృహ రుణాలపై వడ్డీ రేట్లు సుమారు 14 శాతం పాయింట్లు పెరిగాయి. మరోవైపు చమురు ధరల కారణంగా ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోతోంది. పెరిగిన చమురు ధరలవలన కలిగే తాత్కాలిక ఒడిదుడుకులే ద్రవ్యోల్బణానికి, గృహ‌ రుణాలపై వడ్డీ రేటు పెరగడానికి కారణమని అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌ తెలిపారు. కాగా దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణ పరిస్థితుల కారణంగా గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం 4.2 శాతం తగ్గింది. గత సంవత్సరం ఫిబ్రవరి తర్వాత దరఖాస్తుల సంఖ్య ఇంత తక్కువగా రావడం ఇదే మొదటిసారి. జనవరి నెలలో వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ప్రస్తుతం వాటి సంఖ్య సగానికి సగం పడిపోయింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్