మధ్యంతరంలో మెజారిటీ వస్తే విచారణకు సన్నాహాలు
వాషింగ్టన్ : శాంతి దూత ముసుగులో మధ్యప్రాచ్యంలో పెట్టుబడులు పెడుతూ జేబులు నింపుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ వ్యవహారాలపై డెమొక్రటిక్ పార్టీ సీనియర్ నేత రాబర్ట్ గార్సియా ఆరా తీస్తున్నారు. ఇజ్రాయిల్ సైనిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న ఫీనిక్స్ ఫైనాన్షియల్ కంపెనీలో కుష్నర్ యొక్క ప్రైవేటు ఈక్విటీ సంస్థ అతి పెద్ద వాటాదారుగా ఉన్నదని సీఎన్‌ఎన్ వార్తా సంస్థ గత వారం జరిపిన పరిశోధనలో బయటపడింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ కంపెనీలో కుష్నర్ పెట్టిన పెట్టుబడులపై డెమొక్రటిక్ పార్టీ నాయకుడు, హౌస్ ఓవర్‌సైట్ కమిటీలో సీనియర్ సభ్యుడు రాబర్ట్ గార్నియా సమాచారాన్ని సేకరిస్తున్నారు. అందులో భాగంగా కుష్నర్ సంస్థ అఫినిటీ పార్టనర్స్‌కు ఆయన ఓ లేఖ రాశారు. 'దేశాధ్యక్షుడు ట్రంప్, ఆయన కుటుంబం తమ అధికారాన్ని ఉపయోగించుకొని అసాధారణమైన, ప్రమాదకరమైన మార్గాలలో ఆర్థిక ప్రయోజనం పొందిన తీరుపై కమిటీలోని డెమొక్రాట్లు దర్యాప్తు జరుపుతున్నారు' అని ఆ లేఖలో ఆయన తెలియజేశారు.
సీఎన్‌ఎన్ ఏం చెప్పింది ?
ఇజ్రాయిల్ ఆర్థిక చట్టాలను ఉపయోగించి ఫీనిక్స్ ఫైనాన్షియల్ పెట్టిన పెట్టుబడులను సీఎన్‌ఎన్ గుర్తించింది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు టెల్ అవీవ్‌కు చెందిన ఈ సంస్థలో కుష్నర్ యొక్క అఫినిటీ పార్ట్‌నర్స్ తన వాటాను రెట్టింపు చేసింది. ఫీనిక్స్‌కు చెందిన పదవీ విరమణ ఖాతాల ద్వారా పెట్టిన పెట్టుబడుల జోలికి పోకుండా బీమా రంగంలోని ఆస్తులపై దృష్టి సారించింది. మరోవైపు ఫీనిక్స్ కంపెనీ ఇజ్రాయిల్ ఆయుధ తయారీ సంస్థ ఎల్బిట్ సిస్టమ్స్‌లో వందల మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. అంతేకాదు...డ్రోన్లు, యుద్ధ నౌకలు మొదలుకొని విధ్వంసక యంత్రాల వరకూ ఇజ్రాయిల్ సేనలకు సామగ్రిని అందించే మరో ఎనిమిది కంపెనీలలో కూడా ఫీనిక్స్‌కు వాటాలు ఉన్నాయి. సీఎన్‌ఎన్ గుర్తించిన తొమ్మిది కంపెనీల వాటాల విలువ గత సంవత్సరం పెరగడం గమనార్హం. గాజా యుద్ధం తమ వ్యాపారాలకు డిమాండ్‌ను పెంచిందని వాటిలో కొన్ని కంపెనీలు చెప్పాయి కూడా. సీఎన్‌ఎన్ గుర్తించిన కంపెనీలలో కుష్నర్‌కు చెందిన అఫినిటీి పార్టనర్స్‌కు నేరుగా వాటాలు లేవు. కానీ ఫీనిక్స్‌కు లాభం వచ్చినప్పుడు దానిలో అతి పెద్ద వాటాదారుగా అఫినిటీ కూడా అందులో భాగాన్ని పొందింది. ఫీనిక్స్‌ను అఫినిటీ యొక్క 'ఉత్తమ పెట్టుబడి'గా కుష్నర్ గతంలో అభివర్ణించారు. సీఎన్‌ఎన్ కథనం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నదని కుష్నర్ ఆరోపించారు. అయితే ఆ కథనంలోని ఏ తప్పునూ ఆయన ఎత్తిచూపలేకపోయారు. మధ్యప్రాచ్యంలో శాంతి రాయబారిగా కుష్నర్ స్వచ్ఛందంగా పోషిస్తున్న పాత్రకు, ఆయన సంస్థ యొక్క పెట్టుబడులకు మధ్య పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉండే అవకాశాలపై సీఎన్‌ఎన్ వార్తా సంస్థ అనేక ప్రశ్నలు లేవనెత్తింది.
మీ వ్యాపార లావాదేవీల సమాచారం ఇవ్వండి
'మీరు అమెరికన్ల భద్రత, రక్షణకు నష్టం కలిగించి గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు పొందారా లేదా అని తెలుసుకోవడానికి వీలుగా మధ్యప్రాచ్యంలో మీ వ్యాపార లావాదేవీల సమాచారాన్ని నేను కోరుతున్నాను' అని కాలిఫోర్నియాకు చెందిన డెమొక్రటిక్ నేత రాబర్ట్ గార్నియా తన లేఖలో పేర్కొన్నారు. వచ్చే నెలలో అమెరికాలో జరిగే మధ్యంతర ఎన్నికలలో మెజారిటీ సాధిస్తే ట్రంప్, ఆయన కుటుంబ సభ్యుల స్వదేశీ, విదేశీ వ్యాపార లావాదేవీలపై దర్యాప్తు జరిపేందుకు డెమొక్రాట్లు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఈ లేఖ ఓ సంకేతంగా నిలుస్తోంది. కాగా తమ నేతపై కుష్నర్ న్యాయవాది చేసిన ఆరోపణలను గార్సియా ప్రతినిధి సారా గెర్రెరో తోసిపుచ్చారు. కుష్నర్ పెట్టుబడుల ఉదంతం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గార్సియా ఎలాంటి స్టాక్స్ ట్రేడింగ్ చేయరని, పింఛను పథకంలోని లక్షలాది ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఆయనకు కూడా ఆ నిధిపై ఎలాంటి నియంత్రణ ఉండదని స్పష్టం చేశారు. గార్సియా ఇటీవల వెల్లడించిన పత్రాల ప్రకారం...ఆయన పింఛను పథకాలకు ఫీనిక్స్ ఫైనాన్షియల్, ఎల్బిట్ సిస్టమ్స్‌లో వాటాలు ఉన్నాయి. కుష్నర్ తన మామ తరఫున మధ్యప్రాచ్యంలో పర్యటిస్తూనే ఎలాంటి జవాబుదారీతనం లేకుండా లక్షలాది డాలర్లు సంపాదిస్తున్నారని గెర్రెరో ఆరోపించారు. 'అఫినిటీ పార్ట్‌నర్స్ పెట్టుబడులకు, మధ్యప్రాచ్యంలో మీ వ్యవహారాలకు మధ్య పరస్పర విరుద్ధ ప్రయోజనాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. దీనివల్ల అవినీతి ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. అందుకే పర్యవేక్షణను, జవాబుదారీతనాన్ని కాంగ్రెస్ కోరుతోంది' అని గార్సియా తన లేఖలో తెలిపారు.
ఎదురు దాడికి దిగిన కుష్నర్ న్యాయవాది
గార్సియా వాదనలను కుష్నర్ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. ఇజ్రాయిల్ కంపెనీలో గార్నియాకు కూడా వాటా ఉన్నదంటూ ఎదురు దాడికి దిగారు. 'తనకు వాటా ఉన్న కంపెనీలో ఓ సాధారణ పౌరుడికి వాటా ఉన్నదని కాంగ్రెస్ సభ్యుడు ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది' అని వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్ ఆర్థిక సేవల సంస్థ ఫీనిక్స్ ఫైనాన్షియల్‌లో అఫినిటీ పార్ట్‌నర్స్ అతి పెద్ద వాటాదారు అని, అలాగే ఇజ్రాయిల్‌కు చెందిన అతి పెద్ద ఆయుధ తయారీ సంస్థ ఎల్బిట్ సిస్టమ్స్‌కు కూడా అందులో వాటాలు ఉన్నాయని వివరించారు. ఫీనిక్స్ కంపెనీ ఏమి కొనాలో, ఏమి అమ్మాలో నిర్ణయించడంలో కుష్నర్‌కు ఎలాంటి పాత్ర లేదని చెప్పారు.
దౌత్యానికీ, వ్యాపారానికీ లింకు
కుష్నర్ దౌత్య పాత్రకు, ఆయన వ్యాపారాలకు మధ్య సంబంధం ఉన్నదంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక కూడా ఓ కథనాన్ని ప్రచురించింది. యుద్ధాన్ని ముగించడానికి రష్యాతో అమెరికా జరిపిన చర్చల సందర్భంగా... మాస్కోకు చెందిన ఓ అతి పెద్ద ఇంధన సంస్థ చమురు ఆస్తులను ట్రంప్ దూతలైన స్టీవ్ విట్‌కాఫ్, జేర్డ్ కుష్నర్‌లతో సంబంధమున్న పెట్టుబడిదారులకు విక్రయించేందుకు ఒప్పందం కుదిరిందని ఆ పత్రిక బయటపెట్టింది.






కామెంట్‌లు (0)