నేటి రోజుల్లో చాలా మంది అమ్మాయిలు చదువు, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. కొంతమంది అక్కడ అద్దెకు రూమ్స్ లేదా ఇల్లు తీసుకుని నివాసముంటుంటారు. అయితే వారిని కొందరు ఇంటి యజమానులు పలు రకాలుగా ఇబ్బంది పెడుతుంటారు. మరికొందరు చిన్నచూపు కూడా చూస్తుంటారు. ఇంటికి యజమాని అయినంత మాత్రాన వారికి సర్వాధికారాలు ఉండవని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. అద్దె ఇంట్లో ఉండే వారికి కూడా కొన్ని హక్కులు ఉంటాయని చెబుతున్నారు. మరి, కిరాయి ఇళ్లలో ఉండే మహిళలకు లభించే ఆ హక్కులేంటో తెలుసుకుందాం. చీటికిమాటికి వస్తున్నారా: కొంతమంది యజమానులు ఇల్లు అద్దెకు ఇచ్చిన తర్వాత కూడా చీటికిమాటికి వస్తుంటారు. దీనివల్ల అద్దెకు ఉండే మహిళల ప్రైవసీకి భంగం కలిగే ఛాన్స్ ఉంటుంది. అయితే, చట్టపరంగా యజమానికి అలాంటి హక్కు ఉండదని చెబుతున్నారు నిపుణులు. ఇంటికి కిరాయి కట్టినంత కాలం అది వారిదే అవుతుందంటున్నారు. ఒకవేళ ఇంట్లోకి యజమాని రావాలంటే ‘రెంటల్ అగ్రిమెంట్’ నిబంధనలను తప్పకుండా పాటించాలంటున్నారు. అయితే పైప్‌లైన్ లీకవడం వంటి ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం యజమాని ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చే హక్కు ఉంటుందట.
అంతేకానీ చీటికిమాటికి వస్తూ మీ ప్రైవసీకి భంగం కలిగిస్తుంటే మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయొచ్చని చెబుతున్నారు. వివక్ష చూపిస్తున్నారా?: ఇంటి యజమానుల్లో కొంతమంది వైవాహిక స్థితి, సామాజిక వర్గం, చేసే జాబ్‌ను బట్టి కూడా అద్దెకుండే వారిపై వివక్ష చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఇంటిని అద్దెకు ఇవ్వడానికి నిరాకరిస్తే, మరికొందరు మాత్రం కఠినమైన నిబంధనలు పెడుతుంటారు. అయితే ‘మోడల్ టెనన్సీ యాక్ట్’ ప్రకారం అద్దెకుండే వారిపై యజమానులు ఎలాంటి వివక్ష చూపించకూడదట. అద్దెకుండేవారిపై వివక్ష చూపించినందుకు గాను పలు కేసుల్లో హౌసింగ్ సొసైటీలకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పునిచ్చిన సందర్భాలు ఉన్నాయట. అందుకే ఇలా వ్యక్తిగత అంశాలను దృష్టిలో పెట్టుకుని వివక్ష చూపిస్తే మాత్రం అందుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. ఇల్లు ఖాళీ చేయమంటున్నారా?: కొన్ని సందర్భాల్లో ఇంటి యజమానులు అకస్మాత్తుగా వచ్చి ఇల్లు ఖాళీ చేయమని అంటుంటారు. అందుకు ఏదో ఒక కారణాన్ని సాకుగా చెబుతుంటారు.
కానీ, యజమానికి ఇలాంటి హక్కు ఉండదని నిపుణులు అంటున్నారు. ఇల్లు ఖాళీ చేయించాలంటే ‘రెంటల్ అగ్రిమెంట్’ ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. అందుకోసం ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో చట్టపరంగా ముందుకు వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు. బలవంతంగా బంద్ చేస్తున్నారా?: కొన్ని సందర్భాల్లో కారణమేదైనా ఇంటి యజమానులు ఒప్పందాన్ని ఉల్లంఘించి అద్దెకుండే వారిని బలవంతంగా బయటకు పంపించాలని చూస్తారు. ఈ విషయాన్ని వారికి తెలియజేయకుండా కరెంట్ బంద్ చేయడం, వాటర్ రాకుండా ఆపేయడం వంటివి చేస్తుంటారు. కానీ, యజమానులకు ఇలా చేసే హక్కు ఉండదంటున్నారు నిపుణులు. ‘మోడల్ టెనన్సీ యాక్ట్’తో పాటు కొన్ని రాష్ట్రాల చట్టాలూ ఇలాంటి తీరుని వ్యతిరేకిస్తున్నాయని చెబుతున్నారు. ఒకవేళ టైమ్‌కు ఇంటి అద్దె కట్టకున్నా కూడా యజమాని చట్టబద్ధంగానే వ్యవహరించాలట. ఇలాంటి పరిస్థితి ఎదురైతే న్యాయపరంగా ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు.
ఒంటరిగా ఉంటున్నారా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



