Magazines

అదరగొట్టిన అస్మిత

57 నిమిషాల క్రితం

The amazing Asmita
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

ప్రపంచ 2వ ర్యాంకర్‌ యమగుచిపై గెలుపు

ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌-750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ మహిళా షట్లర్‌ అస్మిత చాలీహా పెను సంచలనాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో అస్మిత ఏకంగా ప్రపంచ 2వ ర్యాంకర్‌, జపాన్‌కు చెందిన అకానే యమగుచిపై సంచలన విజయం సాధించింది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన అస్మిత 21-19, 21-18తో కేవలం 37 నిమిషాల్లోనే యమగుచిని ఓడించి కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచ టాప్‌-5 క్రీడాకారిణిపై అస్మిత గెలుపొందడం ఇదే తొలిసారి. మరో సింగిల్స్‌ పోటీలో పివి సింధు 21-12, 21-16 తేడాతో 44 నిమిషాల్లో జపాన్‌కు చెందిన రికో గుంజిపై సునాయాసంగా విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. దీంతో భారత్‌కు చెందిన ఇద్దరు మహిళా షట్లర్లు సూపర్ 750 టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరడం ఇదే తొలిసారి. 2019లో చివరిసారిగా ఫ్రెంచ్ ఓపెన్‌లో సైనా నెహ్వాల్, సింధు ఇద్దరూ క్వార్టర్‌ఫైనల్‌కు చేరి ఈ ఘనతను సాధించారు. అస్సాంకు చెందిన 26 ఏళ్ల అస్మిత ఈ ఏడాది ఆగస్టులో జరిగిన కొరియా మాస్టర్స్ సూపర్-300లో తొలి బిడబ్ల్యుఎఫ్‌ వరల్డ్ టూర్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆ టోర్నీ ఫైనల్లో చైనాకు చెందిన హాన్ కియాన్ క్సీని 14-21, 21-14, 21-14 తేడాతో ఓడించి కెరీర్‌ తొలి టైటిల్‌ సాధించింది. ఇక సూపర్ 750 టోర్నమెంట్‌లో ఆమె సాధించిన అతి పెద్ద విజయం ఇదే. 2022 మే లో థాయ్‌లాండ్ ఓపెన్‌లో పివి సింధు యమగుచిని చివరిసారిగా ఓడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్