అరుణాచల్‌ప్రదేశ్ క్రికెట్‌కు కన్వీనర్ నియామకం
ముంబయి : అంతర్గత విభేదాలతో ఎన్నికలపై న్యాయస్థానంలో కొట్లాడుతున్న అరుణాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కన్వీనర్‌ను నియమించింది. ఎన్నికల వివాదం ఈటానగర్ హైకోర్టు బెంచ్‌పై విచారణకు ఉండగా.. దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లకు అరుణాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తమ జట్లను ఎంపిక చేయలే దు. రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో తొలి రౌండ్లో నాగాలాండ్ తో అహ్మదాబాద్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఆడాల్సి ఉండగా.. ఏసీఏ జట్టును పంపించలేదు. ఈ నెల 26 నుంచి ఆరంభం కానున్న సీనియర్ మహిళల టోర్నమెంట్‌తో పాటు కల్నల్ సికె నాయుడు, విజయ్ మర్చంట్ ట్రోఫీలకు సైతం జట్లను ఎంపిక చేయలేదు. దీంతో బీసీసీఐ జోక్యం చేసుకుని అరుణాచల్ ప్రదేశ్ క్రికెటర్లకు న్యాయం చేయాలని ఆటగాళ్లు బోర్డును కోరారు. దీంత రంగంలోకి దిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు ఖైరుల్ జమాల్ మజుందార్‌ను ఏసీఏ కన్వీనర్‌గా నియమించింది. మాజీ క్రికెటర్లు సత్య గోపాల్ చక్రవర్తి, జయంత చౌదరి, దీప్ బోరాలతో సెలక్షన్ కమిటీని నియ మించింది. సీనియర్, జూనియర్ క్రికెట్ జట్ల ఎంపిక, సెలక్షన్ ట్రయల్స్ బాధ్యతలను కన్వీనర్‌కు అప్పగిం చింది. క్రికెటర్లు అందరూ ట్రయల్స్‌లో పోటీపడేలా ప్రకటనలు సైతం ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసింది. 'అరుణాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వివాదం మా దృష్టికి వచ్చిన తర్వాత, న్యాయపరమైన అంశాలను పరిశీలించాం. క్రికెటర్లకు న్యాయం చేకూరేలా దేశవాళీ టోర్నీల్లో ఏసీఏ జట్టు పోటీపడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఆటగాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలుగకూడదని బీసీసీఐ రంగంలోకి దిగింది' అని బోర్డు కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపారు.






కామెంట్లు (0)