Tuesday, August 18, 2026
E-PAPER
Homeఆటలుఆయుష్‌ అదరహో

ఆయుష్‌ అదరహో

- Advertisement -

వరల్డ్‌ నం.1 షి యుకిపై సంచలన విజయం
పి.వి సింధు, గాయత్రి జోడీ శుభారంభం
బిడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ చాంపియన్‌‌షిప్స్‌

భారత యువ షట్లర్‌ ఆయుష్‌ ‌శెట్టి అద్భుతం చేశాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌‌లో జెయింట్‌ ‌కిల్లర్‌‌గా పేరొందిన ఆయుష్‌ ‌శెట్టి తన కెరీర్‌‌లోనే అతిపెద్ద విజయం నమోదు చేశాడు. వరల్డ్‌‌ నం.1, డిఫెండింగ్‌ ‌చాంపియన్‌ ‌షి యుకి (చైనా)పై తొలి రౌండ్లోనే అద్వితీయ విజయం సాధించి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌‌లో ప్రకంపనలు సృష్టించాడు.
​నవతెలంగాణ-న్యూఢిల్లీ
1965 తర్వాత బ్యాడ్మింటన్‌ ఆసియా చాంపియన్‌‌షిప్స్‌‌లో పతకం సాధించిన తొలి భారత మెన్‌ ‌షట్లర్‌‌గా నిలిచిన ఆయుష్‌ ‌శెట్టి.. అదే జోరు 2026 బిడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ చాంపియన్‌‌షిప్స్‌‌లో కొనసాగిస్తున్నాడు. ఆసియా బ్యాడ్మింటన్‌ ‌చాంపియన్‌‌షిప్స్‌ ‌మెడల్‌ ‌రేసులో ప్రపంచ బ్యాడ్మింటన్‌ అగ్రశేణి షట్లర్లు లి షి ఫెంగ్‌, జొనాథన్‌ ‌క్రిస్టీ, కునాల్‌‌విట్‌ ‌విటిడ్‌‌శరణ్‌‌లను మట్టికరిపించిన ఆయుష్‌ ‌శెట్టి.. తాజాగా వరల్డ్‌ ‌నం.1, చైనా స్టార్‌ ‌షి యుకిని చిత్తు చేశాడు. న్యూఢిల్లీలోని ఇంధిరాగాంధీ ఇండోర్‌‌ స్టేడియంలో సోమవారం జరిగిన ప్రపంచ చాంపియన్‌‌షిప్స్‌ ‌పురుషుల సింగిల్స్‌ ‌తొలి రౌండ్లో డిఫెండింగ్‌ ‌చాంపియన్‌ ‌షి యుకికి ఆయుష్‌ ‌శెట్టి చుక్కలు చూపించాడు. 21-14, 13-21, 21-19తో ఆయుష్‌ ‌శెట్టి మూడు గేముల మ్యాచ్‌‌లో అద్వితీయ విజయం నమోదు చేశాడు.

​ఆయుష్‌ అదరగొట్టాడు
ఈ ఏడాది ఏప్రిల్‌‌లో ఆసియా బ్యాడ్మింటన్‌ ‌చాంపియన్‌‌షిప్స్‌‌లో సిల్వర్‌ మెడల్‌, యుఎస్‌ ఓపెన్‌ ‌సూపర్‌ 300 ‌టైటిల్‌ ‌సాధించినా ఆయుష్‌ ‌శెట్టిపై ప్రపంచ చాంపియన్‌‌షిప్స్‌‌లో పెద్దగా అంచనాలు లేవు. అందుకు కారణం, తొలి రౌండ్లోనే అతడు డిఫెండింగ్‌ ‌చాంపియన్‌, వరల్డ్‌‌నం.1 షి యుకితో తలపడాల్సి రావటం. కెరీర్‌‌లో తనకంటే మెరుగైన ర్యాంక్‌ ‌షట్లర్లు, టాప్‌-10 ఆటగాళ్లను ఓడించిన రికార్డు ఆయుష్‌ ‌సొంతం. సోమవారం న్యూఢిల్లీలో షి యుకి సైతం ఆయుష్‌ ‌శెట్టి దెబ్బకు టోర్నమెంట్‌ ‌నుంచి నిష్క్రమించాడు. తొలి గేమ్‌‌లో వేగంగా పాయింట్లు సాధించిన ఆయుష్‌ ‌శెట్టి 11-5తో విరామ సమయానికి ముందంజలో నిలిచాడు. ఆయుష్‌ ‌స్మాష్‌‌లు, కచ్చితమైన డ్రాప్‌ ‌షాట్లతో మెరువగా.. షి యుకి తడబడ్డాడు. నెట్‌ ‌దగ్గర, లైన్ దగ్గర పొరపాట్లు చేస్తూ ఎక్కువగా పాయింట్లు కోల్పోయాడు. షి యు కి తేరుకునే లోపే తొలి గేమ్‌‌ను ఆయుష్‌ ‌శెట్టి ఖాతాలో వేసుకున్నాడు. కానీ డిఫెండింగ్‌ ‌చాంపియన్‌ ‌షి యుకి అంత సులువుగా ఆశలు వదులుకోలేదు. రెండో గేమ్‌‌లో గొప్పగా పుంజుకున్నాడు. సుదీర్ఘ ర్యాలీలతో ఆయుష్‌ ‌శెట్టి అలిసిపోయేలా చేసిన షి యుకి ప్రత్యర్థి పొరపాట్ల నుంచి పాయింట్లను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌ ‌షి యుకి ఖాతాలో వేసుకోవటంతో మ్యాచ్‌ ‌నిర్ణయాత్మక మూడో గేమ్‌‌కు దారితీసింది. మూడో గేమ్‌‌లో ఆయుష్‌ ‌శెట్టి తెలివిగా ఆడాడు. షటిల్‌‌ను కోర్టు లోపలే ఉంచేలా ఆడుతూ.. పాయింట్ల కోసం షి యుకి రిస్క్‌ ‌తీసుకునేలా చేశాడు. ఈ వ్యూహం పని చేయటంతో నిర్ణయాత్మక గేమ్‌‌లోనూ ఆయుష్‌ ‌శెట్టి 11-5తో ముందంజ వేశాడు. 15-5తో ఆయుష్‌ ‌శెట్టి దుమ్మురేపినా ఆఖర్లో కాస్త తడబాటుకు గురయ్యాడు. దీంతో షి యుకి 15-20తో పుంజుకున్నాడు. ఓ దశలో 19-20తో ఆయుష్‌ ‌శెట్టిని ఒత్తిడికి గురి చేసినా.. ఆయుష్‌ ‌కీలక మ్యాచ్‌ ‌పాయింట్‌‌తో వరల్డ్‌ ‌నం.1ను తొలి రౌండ్‌ ‌నుంచే ఇంటిబాట పట్టించాడు.

​సింధు సునాయాసంగా
మహిళల సింగిల్స్‌‌లో పి.వి సింధు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్లో 21-7, 21-11తో సులువుగా గెలుపొందింది. ఐర్లాండ్‌ ‌షట్లర్‌ ‌సోఫియా నొబెల్‌‌ను సింధు వరుస గేముల్లో చిత్తు చేసింది. ప్రపంచ చాంపియన్‌‌షిప్స్‌‌లో రెండు కాంస్య పతకాలు, రెండు రజత పతాకాలు, ఓ పసిడి సాధించిన సింధు.. రికార్డు ఆరో మెడల్‌పై కన్నేసింది. 29 నిమిషాల్లోనే తొలి రౌండ్లో గెలుపొందిన సింధు చెమటపట్టకుండా ముందంజ వేసింది. మహిళల డబుల్స్‌‌లో పుల్లెల గాయత్రి గోపీచంద్‌, ట్రెసా జాలి జోడీ ముందంజ వేసింది. తొలి రౌండ్లో 21-9, 21-13తో స్పెయిన్‌ ‌జోడీ లోపెజ్‌, లూసియాలపై గాయత్రి, ట్రెసా ఘన విజయం సాధించారు. పురుషుల డబుల్స్‌‌లో ఐదో సీడ్‌ ‌సాత్విక్‌‌సాయిరాజ్‌ ‌రాంకిరెడ్డి, చిరాగ్‌ ‌శెట్టికి తొలి రౌండ్లో బై లభించిన సంగతి తెలిసిందే. రెండో రౌండ్లో స్కాట్లాండ్‌ ‌షట్లర్లు అలెగ్జాండర్‌, ఆడమ్‌‌లతో సాత్విక్‌, చిరాగ్‌‌లు తలపడనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -