మార్చి 9న కార్మిక, రైతు పార్లమెంట్
మార్చి 10 నుంచి ఏప్రిల్ 13 వరకు దేశవ్యాప్తంగా మహాపంచాయత్‌లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఇండియా-యూఎస్ వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర కీలక సమస్యలపై విజయం సాధించే వరకు దేశవ్యాప్తంగా ఐక్య పోరాటాలకు సంయుక్త కిసాన్ మోర్చా సిద్ధమైంది. మంగళవారం హర్యానాలోని కురుక్షేత్రలో ఎస్కేఎం జనరల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఎస్కేఎం నేతలు రాకేష్ టికాయిత్, అశోక్ ధావలే, జోగీందర్ సింగ్ ఉగ్రహన్, ఆశిష్ మిట్టల్, జగ్‌మోహన్ సింగ్, రాజన్ క్షీరసాగర్, జోగీందర్ సింగ్ నైన్‌లతో కూడిన ఏడుగురు సభ్యులు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ సహా తొమ్మిది రాష్ట్రాల నుంచి 150 మంది పాల్గొన్నారు.
”ఇండియా-యూఎస్ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయొద్దు, విద్యుత్ బిల్లును తిరస్కరిం చాలి, విత్తన బిల్లు, నాలుగు కార్మిక కోడ్‌లు, వీబీజీ రామ్‌జీ చట్టం రద్దు, ఎంఎస్పీ ఏసి2ం50 శాతం కోసం చట్టపరమైన హామీ, రుణమాఫీ, ఎల్‌ఎఆర్‌ఆర్ చట్టం-2013 అమలు” వంటి ప్రధాన డిమాండ్లు సాధించే వరకు స్వతంత్ర పోరాటాలను, అలాగే కార్మిక సంఘాలతో కలిసి ఐక్య పోరాటాలను తీవ్రతరం చేయాలని ఎస్కేఎం జాతీయ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది.
రాష్ట్రపతికి బహిరంగ లేఖలు పంపేందుకు పోస్టాఫీసులకు ఊరేగింపులు
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్‌ను తొలగించాలని, దేశ వ్యతిరేక ఇండియా- అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయొద్దని ప్రధానమంత్రిని ఆదేశించాలని, గోధుమ, వరి రైతులకు బోనస్‌ను రద్దు చేయాలనే డీవో లేఖను ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆదేశించాలని డిమాండ్ చేస్తూ మార్చి9 వరకు బహిరంగ సభలతో గ్రామాలకు పోరాటాన్ని విస్తరించేలా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతికి బహిరంగ లేఖలను పంపడానికి రైతులు పోస్టాఫీసులకు ఊరేగింపులు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఆపిల్, సోయాబీన్, పత్తి, మొక్కజొన్న వంటి ప్రభావిత పంటలను పండించే గ్రామాల్లో ప్రచారాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.
రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలకు రైతు నేతల వినతులు
ఫిబ్రవరి 27న లేదా తదుపరి రోజుల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రతిపక్ష నేతలను ఎస్కేఎం ప్రతినిధులు కలిసి వినతిపత్రాలు సమర్పిస్తారు. మోడీ ప్రభుత్వం అధికార కేంద్రీకరణను ఎదుర్కోవాలని, రాష్ట్రాల సమాఖ్య హక్కులను కాపాడాలని, రాష్ట్రాల పన్ను అధికారాన్ని పునరుద్ధరించ డానికి జీఎస్టీ చట్టాన్ని సవరించాలని, సెస్, సర్‌చార్జిలతో సహా రాష్ట్రాలకు ప్రస్తుత 33 శాతం పూల్‌కు బదులుగా 60 శాతం వాటాను కేటాయించాలని డిమాండ్ చేస్తారు.
మార్చి 9న కార్మిక-రైతు పార్లమెంటు
రెండో దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదటి రోజు మార్చి 9న ట్రేడ్ యూనియన్లు, వ్యవసాయ కార్మికుల వేదికలతో పాటు జంతర్ మంతర్‌లో కార్మిక-రైతు పార్లమెంటును నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. మార్చి 10న పంజాబ్‌లోని బర్నాలా నుంచి ప్రారంభమై, ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ దినోత్సవం వరకు దేశవ్యాప్తంగా మహాపంచాయతీలను నిర్వహించాలని ఎస్కేఎం సమావేశం అన్ని రాష్ట్ర సమన్వయ కమిటీలకు పిలుపునిచ్చింది. ఈ మహా పంచాయతీలు వేలాది మంది రైతులను సమీకరించి, ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందం, మోడీ ప్రభుత్వ ఇతర కార్పొరేట్ అనుకూల విధానాల ప్రమాదాలను వివరించాలని, భవిష్యత్తులో సుదీర్ఘ పోరాటానికి సిద్ధం చేయాలని పేర్కొంది.
మార్చి 23న సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవం
మార్చి 23న అమరవీరుల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర స్థాయిల్లో ప్రణాళికను రూపొందించాలని సూచించింది. పంజాబ్, ఒడిశా, మహారాష్ట్రలో రైతుల ఆందోళనలపై పోలీసుల అణచివేతను ఖండిస్తూ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఎంఎస్పీ, సంబంధిత రైతుల డిమాండ్లపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీని కలవడానికి 15 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఎస్కేఎం ట్రేడ్ యూనియన్లు, వ్యవసాయ కార్మిక సంఘాల వేదికతో సమన్వయ సమావేశాలను నిర్వహించి, ఐక్య పోరాటాల తుది ప్రణాళికను నిర్ణయిస్తుందని ఎస్కేఎం నేతలు అశోక్‌ధావలే, రాకేష్ టికాయిత్ తెలిపారు. అంతకుముందు జాట్ ధర్మశాలలో చౌదరి ఛోటూ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సమరభేరీ
- Advertisement -
- Advertisement -



