Tuesday, July 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆటో యజమానులకు బిగ్ రిలీఫ్

ఆటో యజమానులకు బిగ్ రిలీఫ్

- Advertisement -

స్క్రాపింగ్‌ షరతుపై ఎఫ్‌సీ రెన్యువల్‌ లేకుండానే పర్మిట్‌ బదిలీకి అనుమతి
రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలు
‘రవాణా శాఖలో తలతిక్క నిబంధనలు’ కథనానికి కదిలిన అధికారులు
‘నవతెలంగాణ’ కథనానికి స్పందన
నవతెలంగాణ – సిటీబ్యూరో

​రవాణా శాఖలో ఆటో యజమానులను వేధిస్తున్న అనవసర నిబంధనలు, అదనపు ఆర్థిక భారంపై ‘నవతెలంగాణ’ ప్రచురించిన కథనానికి రవాణా కమిషనర్‌ నుంచి సానుకూల స్పందన లభించింది. ఈనెల 19న నవతెలంగాణ తెలుగు దినపత్రికలో ‘రవాణా శాఖలో తలతిక్క నిబంధనలకు!’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై స్పందించిన రవాణా శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ఓఆర్ఆర్ పరిధిలోని పాత ఆటో-రిక్షా యజమానులకు ఊరట కలిగిస్తూ రవాణా కమిషనర్ మెమో నెం.6027/ఆర్/2021 (తేదీ: 24.07.2026) ద్వారా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.

​అనవసర ఆర్థిక భారానికి చెక్
ఓఆర్ఆర్ పరిధిలో తిరుగుతున్న పాత ఎల్‌పీజీ, సీఎన్‌జీ ఆటోలను స్క్రాప్ చేసి, అదే పర్మిట్‌పై కొత్త ఎల్‌పీజీ, సీఎన్‌జీ ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేయాలనుకునే వారికి పాత నిబంధనలు నష్టదాయకంగా మారాయి. సీఎఫ్ఎస్టీ సాఫ్ట్‌వేర్ ప్రక్రియ ప్రకారం.. రిజిస్ట్రేషన్ లేదా పర్మిట్ బదిలీ చేయాలంటే పాత వాహనానికి చెల్లుబాటులో ఉన్న ఫిట్‌నెస్ సర్టిఫికెట్ (ఎఫ్‌సీ) తప్పనిసరి అని అధికారులు పట్టుబట్టేవారు. వెంటనే స్క్రాప్ చేయబోయే వాహనానికి కూడా వేలకు వేలు ఖర్చు చేసి ఎఫ్‌సీ రెన్యువల్ చేయించాల్సి రావడం ఆటో డ్రైవర్లపై తీవ్ర ఆర్థిక భారంగా మారింది. ఈ అంశాన్ని ‘నవతెలంగాణ’ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో రవాణా కమిషనర్ ప్రత్యేకంగా సమీక్షించి నూతన మార్గదర్శకాలు జారీ చేశారు.

​నూతన మార్గదర్శకాలు ఇవే..
ఓఆర్ఆర్ పరిధిలోని పాత ఎల్‌పీజీ, సీఎన్‌జీ ఆటో-రిక్షాల యాజమాన్యం లేదా పర్మిట్ బదిలీ సమయంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్, రెన్యువల్‌ను నిర్బంధం చేయకూడదు. పర్మిట్ బదిలీ పొందిన వ్యక్తి ఆ పాత వాహనాన్ని రోడ్డుపై నడపబోమని, బదిలీ పొందిన తేదీ నుంచి 3 నెలల్లోపు వాహనాన్ని తప్పనిసరిగా స్క్రాప్ చేస్తామని హామీ పత్రం(అండర్‌టేకింగ్) ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తరహా బదిలీలను అనుమతించేలా, అండర్‌టేకింగ్, స్క్రాపింగ్ వివరాలను డేటాబేస్‌లో నమోదు చేసేలా సీఎఫ్ఎస్టీ సాఫ్ట్‌వేర్‌ను తక్షణమే సవరించాలని రవాణా కమిషనర్‌ ఐటీ బృందాన్ని ఆదేశించారు. నిర్దేశిత 3 నెలల వ్యవధిలో సదరు వాహనం స్క్రాప్ అయ్యేలా సంబంధిత రిజిస్టరింగ్ అథారిటీ నిరంతరం ట్రాక్ చేయాలని స్పష్టం చేశారు. కాగా ఈ మార్గదర్శకాలను వెంటనే అమలు చేస్తూ దరఖాస్తులను ప్రాసెస్ చేయాలని హైదరాబాద్ జేటీసీ, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల డీటీసీలు, మేడ్చల్-మల్కాజ్‌గిరి డీటీవోలను ఆదేశించారు.

​హర్షం వ్యక్తం చేసిన ఆటో కార్మికులు
రవాణా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఓఆర్ఆర్ పరిధిలోని వేలాది మంది ఆటో యజమానులకు వేలాది రూపాయల ఆర్థిక భారం తప్పుతుండటంతో పాటు, పర్యావరణహిత ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వాహనాల వినియోగం పెరగనుంది. ఆటో కార్మికుల సమస్యపై స్పందించి అధికారుల్లో చలనం తెప్పించిన ‘నవతెలంగాణ’ దినపత్రికకు సీఐటీయూ, ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -