నవతెలంగాణ – హైదరాబాద్ : రష్యా రాజధాని మాస్కోలో శనివారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు మరణించగా, కనీసం 21 మంది గాయపడ్డారు. స్వయంగా తయారు చేసిన బాంబును తీసుకువచ్చిన గుర్తుతెలియని మహిళతో పాటు మరో ఇద్దరు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
మాస్కో నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కుడ్రిన్‌స్కయా స్క్వేర్‌లోని ఓ చారిత్రక భవనంలో ఉన్న బాల్జి రోస్సీ అనే ఇటాలియన్ రెస్టారెంట్ వెలుపల స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. రష్యా ఉగ్రవాద నిరోధక కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. బాంబుతో వచ్చిన ఓ మహిళ రెస్టారెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. అయితే, అక్కడున్న సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డుకున్నారు. కొద్ది క్షణాల్లోనే ఆమె వద్ద ఉన్న బాంబు పేలింది. ఈ ఘటనలో ఆ మహిళ, సెక్యూరిటీ గార్డు, రెస్టారెంట్‌లోని ఒక కస్టమర్ అక్కడికక్కడే మరణించారు.
పేలుడు ధాటికి 21 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవా బృందాలు, సాయుధ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే, ఈ దాడి వెనుక ఎవరున్నారనే విషయాన్ని అధికారులు ఇంకా ప్రకటించలేదు. మృతుల వివరాలను కూడా గోప్యంగా ఉంచారు.


