Monday, July 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్ ఉత్తర్వుల అమలుకు బ్రేక్

ట్రంప్ ఉత్తర్వుల అమలుకు బ్రేక్

- Advertisement -


అప్పీల్స్ కోర్టులో మరో ఎదురు దెబ్బ
బోస్టన్ :
మెయిల్‘ఇన్‘ఓటింగ్ నిబంధనలను కఠినతరం చేసే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును 23 రాష్ట్రాలలో అమలు చేసేందుకు ప్రభుత్వానికి ఫెడరల్ అప్పీల్స్ కోర్టు అనుమతి నిరాకరించింది. కాంగ్రెస్‌పై నియంత్రణను నిర్ణయించే మధ్యంతర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ట్రంప్ ఈ ఉత్తర్వును జారీ చేశారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులోని కీలక భాగాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని దిగువ కోర్టు న్యాయమూర్తి ఇప్పటికే నిర్ధారించారు. ట్రంప్ ఉత్తర్వులు అమలు కాకుండా డెమొక్రాట్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఇంజక్షన్ ఆర్డర్ పొందాయి. దీనిని ఎత్తివేయాలంటూ ఫెడరల్ ప్రభుత్వం కోరగా ఆ అభ్యర్థనను బోస్టన్‌లోని యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ తోసిపుచ్చింది.
యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి ఇందిరా తల్వానీ ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ అమెరికా న్యాయ శాఖ అప్పీల్స్ కోర్టులో వాదనలు వినిపించింది. అయితే అప్పీల్స్ కోర్టు ఈ వాదనను తిరస్కరించింది. మెయిల్ ద్వారా ఓటు వేసే విధానంపై కఠినమైన నిబంధనలు తీసుకురావాలని ట్రంప్ చాలా కాలంగా కోరుతున్నారు. 2020 ఎన్నికలలో తాను ఓటమి చెందడానికి ఓటింగులో జరిగిన మోసమే కారణమని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో మెయిల్ఇన్ఓటింగ్ నిబంధనలను కఠినతరం చేస్తూ మార్చిలో కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.
అయితే అమెరికా రాజ్యాంగం ప్రకారం సమాఖ్య ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్రాలదే. ఓటును నమోదు చేసుకోవడానికి పౌరసత్వ రుజువును తప్పనిసరి చేస్తూ, మెయిల్ బ్యాలెట్ల లెక్కింపును పరిమితం చేస్తూ గతంలో ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు కూడా న్యాయస్థానం తిరస్కరణకు గురైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -