నవతెలంగాణ - హైదరాబాద్ : తమిళనాడులోని తేని జిల్లాలో సంచలనం సృష్టించిన ఘటన చోటుచేసుకుంది. అక్కడి సబ్‌జైలు నుంచి సోమవారం అర్ధరాత్రి 17 మంది ఖైదీలు పరారయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు తేని నుంచి దిండిగల్ వరకు హైఅలర్ట్ ప్రకటించి గాలింపు చర్యలు చేపట్టారు. పరారైన ఖైదీల్లో ఒకరిని పోలీసులు తిరిగి అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం దాదాపు 16 ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఖైదీలు జైలు వెనుక ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఖైదీలు పథకం ప్రకారం జైలు నుంచి తప్పించుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఒక సెల్లో ఉన్న ఖైదీల్లో ఒకరు మూర్ఛ వచ్చినట్లు నటించడంతో సిబ్బంది ఆ గదిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా భావించిన ఖైదీలు సిబ్బందిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో గాయపడిన జైలు సిబ్బందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పరారైన ఖైదీల ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.






కామెంట్లు (0)