నవతెలంగాణ – హైదరాబాద్: దీపావళి బాణసంచా సంబరాలు పలువురి కంటి చూపుపై ప్రభావం చూపాయి. టపాసులు కాల్చే క్రమంలో గాయపడిన 32 మంది మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చారు. వీరిలో పరిస్థితి తీవ్రంగా ఉన్న ఆరుగురిని వైద్యులు ఇన్‌పేషెంట్లుగా చేర్చుకున్నారు. మిగిలిన 26 మందికి చికిత్స అందించి ఇంటికి పంపించారు. ఆరుగురిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దలు ఉన్నారు. వీరిలో ఒకరు కుడి కంటిచూపును పూర్తిగా కోల్పోయినట్లు ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ ఇబ్రహీం వెల్లడించారు. దీపావళి వేడుకల నేపథ్యంలో మరిన్ని కేసులు వచ్చే అవకాశం ఉందని, అత్యవసర చికిత్సకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
టపాసులు కాల్చేటప్పుడు చిన్నారులపై తల్లిదండ్రులు పర్యవేక్షణ ఉండాలని వైద్యులు సూచించారు. నిప్పురవ్వలు కంటిలో పడితే కంటిని రుద్దకుండా, సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలని హెచ్చరించారు.






కామెంట్‌లు (0)