నవతెలంగాణ - హైదరాబాద్ : దీపావళి సందర్భంగా ఉద్యోగులకు స్వీట్లు, గిఫ్ట్ హ్యాంపర్లు ఇవ్వడం సాధారణం. కానీ ఢిల్లీలోని ఓ కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు ఏకంగా ఐఫోన్ 16 ఫోన్లను బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన ఓ కంపెనీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. 15 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఉద్యోగుల డెస్క్‌లపై రిబ్బన్లతో అలంకరించిన ఐఫోన్ 16 ఫోన్లు కనిపిస్తున్నాయి. తెలుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో ఉన్న ఫోన్లను కంప్యూటర్ల ముందు బహుమతులుగా ఉంచారు. వాటిని చూసిన మహిళా ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.
‘నో కాంపిటీషన్.. మీకు ఏం వచ్చింది?’ అనే క్యాప్షన్‌తో కంపెనీ ఈ వీడియోను పోస్టు చేసింది. దీంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారు. ఇలాంటి కంపెనీలో ఉద్యోగం చేయాలని ఉందంటూ కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు వీడియో ఏఐతో రూపొందించారా? అని సందేహం వ్యక్తం చేశారు. అయితే, ఈ వీడియో ఏఐతో రూపొందించింది కాదని కంపెనీ స్పష్టం చేసింది. మహిళా ఉద్యోగులకు ఐఫోన్లు ఇస్తే, పురుష ఉద్యోగులకు బంగారు నాణేలు ఇచ్చారంటూ ఓ నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించారు. తమ కంపెనీలో కనీసం స్వీట్ల బాక్స్ కూడా ఇవ్వలేదని మరొకరు కామెంట్ చేశారు. మొత్తానికి ఈ కంపెనీ ఇచ్చిన దీపావళి కానుక ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.






కామెంట్లు (0)