నవతెలంగాణ-హైదరాబాద్ : డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ తీవ్ర కలకలం రేపింది. ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలం, నగరం సమీపంలోని తాడివారిమెరక వద్ద ఉన్న ఓఎన్జీసీ డ్రిల్లింగ్ బావి నుంచి భారీ శబ్దంతో గ్యాస్ ఒక్కసారిగా బయటకు ఎగజిమ్మింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజల భద్రతకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా అధికారులను చంద్రబాబు ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా ప్రమాణాలపై సమగ్ర సమీక్ష జరపాలని, ఈ విషయంపై ఓఎన్జీసీ ఛైర్మన్, ఉన్నతాధికారులతో వెంటనే మాట్లాడాలని రాష్ట్ర అధికారులకు సూచించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు.
ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. ప్రమాద స్థలానికి కిలోమీటర్ పరిధిలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి, సురక్షిత శిబిరాలకు తరలించారు. ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్ ఉపకరణాలు వాడొద్దని స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మరోవైపు, ఓఎన్జీసీ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఎలాంటి అగ్నిప్రమాదం జరగలేదని, బావి హెడ్ సురక్షితంగానే ఉందని వారు ధ్రువీకరించారు. గ్యాస్ భూమికి సమీపంలో పేరుకుపోకుండా నిరోధించేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.
డీజిల్ జనరేటర్లు, ఇతర యంత్రాలను నిలిపివేసి, అత్యవసరం లేని సిబ్బందిని అక్కడి నుంచి తరలించారు. లీకేజీని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక సిమెంటింగ్ బృందం ఘటనా స్థలానికి బయలుదేరిందని, నాలుగు నుంచి ఐదు గంటల్లో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకువస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.
కోనసీమలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్..సీఎం చంద్రబాబు సమీక్ష
52 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)