Magazines

పార్లమెంట్‌ సమావేశాల జాప్యం వెనుక రాజకీయ ఎత్తుగడలు : జాన్‌బ్రిట్టాస్‌

10 నిమిషాల క్రితం

Parliament Sessions
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ప్రారంభంలో జాప్యంపై రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయని సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ పేర్కొన్నారు. కేంద్రంపై, మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌ సమావేశాల వాయిదా వెనుక వరుసగా చోటుచేసుకుంటున్న అవిశ్వాస ధోరణులు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు జరుగుతున్న రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయని పేర్కొన్నారు. పార్లమెంట్‌ సమావేశాల జాప్యంపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాధారణంగా పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం సమావేశాలు నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ ప్రారంభంలో మొదలవుతాయని, అయితే అవి ఇంకా ప్రారంభం కాలేదని అన్నారు.


గత కొన్ని రోజులుగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అనిశ్చితిలో ఉన్నాయని అన్నారు. గత వర్షాకాల సమావేశాలు ఇంకా అధికారికంగా ముగిసినట్లు ప్రకటించలేదని అన్నారు. ఆ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికీ ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ప్రధాని మోడీకి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని అన్నారు. అలాగే ఆయనకు తన సొంత పార్టీపై లేదా ప్రభుత్వ యంత్రాంగంపై కూడా నమ్మకం లేదని, అందుకే చేపట్టాల్సిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఇంకా చేపట్టలేదని అన్నారు. రాజకీయ ఎత్తుగడలు జరుగుతున్నాయని అన్నారు. గత 12 ఏళ్ల పార్లమెంటరీ సమావేశాల తీరును పరిశీలిస్తే.. కొవిడ్‌ మహమ్మారి, ఎన్నికల సమయాల్లో మినహా సమావేశాల షెడ్యూల్‌లో మార్పులు చాలా అరుదుగా జరిగేవని అన్నారు.


తాజా జాప్యం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వం కుతంత్రాలకు పాల్పడుతోందని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో, రాజకీయ పార్టీలను విలీనం చేయడం లేదా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం వంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో పార్లమెంటు సమావేశాల షెడ్యూల్‌లో ఏదైనా మార్పు చేయాల్సి వస్తే, ప్రతిపక్షాలను సంప్రదించేవారని ఆయన గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు దేశంలో రాజకీయ చర్చా స్థాయి అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిందని అన్నారు. పార్లమెంటు సమావేశాల విషయంలో తమ వైఖరి ఏమిటో మోడీ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయాలని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్