Magazines

హైదరాబాద్ సీపీగా సజ్జనార్‌ భావోద్వేగ వీడ్కోలు

3 గంటల క్రితం

Sajjanar's emotional farewell as Hyderabad CP
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసిన వీసీ సజ్జనార్‌ బదిలీ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగ వీడ్కోలు సందేశాన్ని పంచుకున్నారు. తన జీవితంలో గత ఏడాది కాలం ఎప్పటికీ మర్చిపోలేని ప్రయాణమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ సీపీగా సేవ చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన సీపీగా బాధ్యతలు చేపట్టనున్న మహేశ్‌ భగవత్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

తన పదవీకాలంలో ప్రజలు, పోలీసు సిబ్బంది అందించిన సహకారాన్ని సజ్జనార్‌ గుర్తుచేసుకున్నారు. ఆహార కల్తీ నియంత్రణకు హెచ్‌-ఫాస్ట్‌, సైబర్‌ నేరాల కట్టడికి ఆపరేషన్‌ ఆక్టోపస్‌, కేసుల దర్యాప్తు పర్యవేక్షణకు ఇన్వెస్టిగేషన్‌ మానిటరింగ్‌ సెల్‌, విద్యార్థుల్లో పోలీసులపై అవగాహనకు ‘డే విత్‌ సీపీ’ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే అమలు, మహిళల భద్రతకు ‘స్పందన’ వాహనాల ఏర్పాటు వంటి చర్యలను ప్రస్తావించారు.

ఈ విజయాల వెనుక పోలీసు సిబ్బంది కృషి ఎంతో ఉందని పేర్కొంటూ హోంగార్డుల నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్‌ ప్రజలు ఎల్లప్పుడూ సురక్షితంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. మధుర జ్ఞాపకాలతో సీపీగా సెలవు తీసుకుంటున్నట్లు సజ్జనార్‌ భావోద్వేగంగా పేర్కొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్