Magazines

హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు..నిందితుల ఫోటో విడుదల..!

19 అక్టోబర్, 2026

Tiger Shorf case
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటనలో దర్యాప్తును ముంబై పోలీసులు ముమ్మరం చేశారు. ఈ దాడికి పాల్పడిన ఇద్దరు నిందితుల తొలి ఫొటోను అధికారులు విడుదల చేశారు. మరోవైపు ఈ ఘటన మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. శాంతిభద్రతల వైఫల్యంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి.

ఆదివారం సాయంత్రం ముంబైలోని జుహూ ప్రాంతంలో ఫుట్‌బాల్ ఆడి ఇంటికి తిరిగి వస్తుండగా, టైగర్ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరపగా, టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనలో ఆయన చేతికి స్వల్పంగా గన్‌పౌడర్ గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌తో పాటు సమీపంలో ఉన్న ఒక ఆటో డ్రైవర్‌కు గాయాలు కావడంతో వారిని నానావతి ఆస్పత్రికి తరలించారు. దాడి తర్వాత నిందితులు తమ ద్విచక్ర వాహనాన్ని అంధేరి స్టేషన్‌లో వదిలి పారిపోయారు. పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, దాని నంబర్ ప్లేట్, ఛాసిస్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

ఈ దాడికి తామే బాధ్యులమంటూ విదేశాల్లో ఉంటున్న గ్యాంగ్‌స్టర్లు అనిల్ పండిట్, హర్మాన్ సంధు.. లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, ఈ ప్రకటనను పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ ఘటన అనంతరం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, సాంస్కృతిక శాఖ మంత్రి ఆశిష్ షెలార్.. టైగర్ ష్రాఫ్ నివాసానికి వెళ్లి ఆయనను, కుటుంబాన్ని పరామర్శించారు. టైగర్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఈ కాల్పుల ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ విమర్శించారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ, ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నటులు, రాజకీయ నాయకులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. టైగర్ ష్రాఫ్‌కు ప్రత్యేక భద్రత కల్పించాలని, చిత్ర పరిశ్రమకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.

ఘటన జరిగిన వెంటనే నటి దిశా పటానీ, టైగర్ సోదరి కృష్ణ ష్రాఫ్ ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ కేసులో పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్