నవతెలంగాణ - హైదరాబాద్: గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్‌లోని జయభేరి గ్రౌండ్స్‌లో నిర్వహించిన గిగ్ వర్కర్ల సభకు వారు హాజరై, పథకానికి సంబంధించిన విధివిధానాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గతంలో గిగ్ వర్కర్లతో జరిగిన సమావేశంలో వారు తమ సమస్యలను వివరించారని, వారి సంక్షేమం కోసం ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేరుస్తున్నామని తెలిపారు.
ఇప్పటివరకు గిగ్ వర్కర్ల పనితీరు, శ్రమకు లభిస్తున్న ప్రతిఫలానికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో లేదన్నారు. ఈ చట్టం ద్వారా వారి పని, డెలివరీలు, శ్రమ, ప్రతిఫలానికి సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఈ సమాచారమంతా వారి మొబైల్ ఫోన్లలోనే అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. గిగ్ వర్కర్ల సౌకర్యార్థం వైఫైతో కూడిన విశ్రాంతి భవనాలను ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో వీటిని నిర్మిస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు.






కామెంట్‌లు (0)