నవతెలంగాణ - హైదరాబాద్: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ముగ్గురు ప్రభుత్వ అధికారులను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇద్దరు రెవెన్యూ అధికారులు, హైదరాబాద్‌లో ఓ విద్యుత్ శాఖ అధికారి ఏసీబీకి చిక్కారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండల డిప్యూటీ తహసీల్దార్ అమనగంటి సందీప్ కుమార్ రెడ్డి, వీఆర్వో నన్నూరి విజయ్ కుమార్ రెడ్డి ఓ ఫిర్యాదుదారుడి కుటుంబానికి చెందిన వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా రూ.2.5 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ సూచన మేరకు ప్రైవేట్ వ్యక్తి కావలి బాలకృష్ణ ద్వారా నగదును తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
మరో ఘటనలో హైదరాబాద్ సంతోష్‌నగర్ సబ్ డివిజన్ పరిధిలోని మాదన్నపేట సెక్షన్ అసిస్టెంట్ ఇంజినీర్ పండాల సంధ్యారాకేష్ ఆరు కొత్త విద్యుత్ మీటర్ల మంజూరు కోసం రూ.1.2 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్-II అధికారులు పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు.
రెండు ఘటనల్లో కలిపి రూ.3.7 లక్షల లంచం సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కీసర ఘటనలో పట్టుబడిన ముగ్గురు నిందితులను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.







కామెంట్‌లు (0)