నవతెలంగాణ - హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ధారూర్ మండలం చింతకుంట గ్రామంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంటకు చెందిన భూపతిరెడ్డి, వాసవి (33) దంపతులకు సహర్షరెడ్డి (8), వేదార్షరెడ్డి (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లల చదువుల నిమిత్తం వారు వికారాబాద్‌లో నివాసం ఉంటున్నారు.
వారాంతపు సెలవు కావడంతో శనివారం భూపతిరెడ్డి భార్య, పిల్లలను కారులో స్వగ్రామమైన చింతకుంటకు తీసుకెళ్లి ఇంటి వద్ద దించి తాండూరుకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఉన్న వాసవి, తన ఇద్దరు పిల్లలతో సహా ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని గమనించిన వాసవి మామ సాయిరెడ్డి.. భూపతిరెడ్డికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ధారూర్ సీఐ రఘురామ్, ఎస్సై సురేశ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని సీఐ తెలిపారు. వాసవి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.






కామెంట్‌లు (0)