నవతెలంగాణ - హైదరాబాద్ : టీనేజ్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అరుదైన అవకాశం దక్కింది. తొలిసారి బీహార్ సీనియర్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌లకు అతడిని సారథిగా నియమించారు. సూరజ్ కశ్యప్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బీహార్ క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
వైభవ్ ఇండియా-ఏ జట్టుతో చేరాల్సి ఉండటంతో కేవలం రెండు మ్యాచ్‌లకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. నవంబర్ 19 నుంచి 29 వరకు ఖతార్‌లోని దోహాలో జరిగే మెన్స్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో అతడు పాల్గొననున్నాడు. ఈ బాధ్యత వైభవ్ ఆటగాడిగా, నాయకుడిగా ఎదగడానికి ఉపయోగపడుతుందని బీసీఏ అధ్యక్షుడు హర్షవర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
2026 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో 175 పరుగులు చేసి భారత్‌కు టైటిల్ అందించడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులతో సత్తా చాటాడు. ఇటీవల అంతర్జాతీయ టీ20ల్లోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు 10 టీ20ల్లో 295 పరుగులు సాధించాడు.
నవంబర్ 4 నుంచి 6 వరకు నిర్వహించిన ట్రయల్స్, గత ప్రదర్శనల ఆధారంగా సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. నవంబర్ 14న సౌరాష్ట్రతో, 16న రైల్వేస్‌తో ఇండోర్‌లో బీహార్ తలపడనుంది.
బీహార్ జట్టు: వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), సూరజ్ కశ్యప్ (వైస్ కెప్టెన్), అలోక్ కుమార్, ఆయుష్ లోహరుకా, అల్తమష్ అష్రఫ్, పరమ్ కుమార్ సింగ్, అన్మోల్ కుమార్, రిత్విక్ రాజ్, మయాంక్ కుమార్, రాఘవేంద్ర ప్రతాప్, ఆశిష్ కుమార్, వాసుదేవ్ ప్రతాప్ సింగ్, మహమ్మద్ ఇజార్, అమోద్ యాదవ్, ప్రశాంత్ సింగ్, నవాజ్ ఖాన్, హిమాన్షు సింగ్.






కామెంట్‌లు (0)