Sunday, July 26, 2026
E-PAPER
Homeఖమ్మంకేటీఆర్ పుట్టినరోజు వేడుకలతో ఒక్కటైన బీఆర్ఎస్ శ్రేణులు

కేటీఆర్ పుట్టినరోజు వేడుకలతో ఒక్కటైన బీఆర్ఎస్ శ్రేణులు

- Advertisement -

– సమన్వయకర్త ఎంపికతో మళ్లీ చీలిక
– తాటి వర్సెస్ మెచ్చా ప్రాబల్య పోరు?
– ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత లేదంటూ అసంతృప్తి
– పనిచేసేవారికి గుర్తింపు ఎక్కడని కార్యకర్తల ఆవేదన
– ఆధిపత్య పోరుతో అయోమయంలో శ్రేణులు
నవతెలంగాణ – అశ్వారావుపేట

కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఏకతాటిపై కనిపించిన అశ్వారావుపేట బీఆర్ఎస్ నాయకత్వం, మండల సమన్వయకర్త నియామకం తర్వాత మళ్లీ రెండు వర్గాలుగా చీలిన పరిస్థితి నెలకొంది.  మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు జడ్పీటీసీ మాజీ సభ్యుడు జేకేవీ రమణారావు ను మండల సమన్వయకర్తగా ప్రకటించడంతో పార్టీలో అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది.

బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత కూడా స్థానికంగా పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తూ, స్థానిక ఎన్నికల్లో పది మందికి లోపు సర్పంచ్‌లు, ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లను గెలిపించుకోవడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేశారు.  కాసాని చంద్రమోహన్ తన సతీమణి నాగ శేష పద్మను రాజకీయాల్లోకి తీసుకువచ్చి మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవికి పోటీ చేయించారు.విజయం సాధించకపోయినా పార్టీ కార్యక్రమాలు,సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

అదే విధంగా డాక్టర్ భూక్యా ప్రసాద్ – ఉదయ్ జ్యోతి దంపతులు కూడా పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికైన ఉదయ్ జ్యోతి తన వార్డులో ప్రజలకు సేవలందిస్తూ గుర్తింపు పొందుతున్నారు.

ఇటీవల కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రెడ్డిగూడెంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ భూక్యా ప్రసాద్–ఉదయ్ జ్యోతి, కాసాని చంద్రమోహన్–నాగశేష పద్మలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు హాజరై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.

అయితే శనివారం కేటీఆర్ జన్మదిన వేడుకల అనంతరం ప్రముఖ నాయకుడి నివాసంలో జరిగిన సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం జేకేవీ రమణారావును మండల సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ నిర్ణయంపై కొందరు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా కాసాని చంద్రమోహన్ స్పందిస్తూ, ఇలాంటి కీలక నిర్ణయాలు నాలుగు గోడల మధ్య కాకుండా పార్టీ శ్రేణుల సమక్షంలో, బహిరంగ సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకుని ప్రకటిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దీనికి స్పందించిన మెచ్చా నాగేశ్వరరావు, “ఇంచార్జిగా నా నిర్ణయమే తుది. ఉండేవారు ఉండండి, వెళ్లేవారు వెళ్లండి” అన్నట్లు వ్యాఖ్యానించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలు అసంతృప్తిని మరింత పెంచినట్లు తెలుస్తోంది.

పార్టీలో ప్రజాప్రతినిధులకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, పార్టీ కోసం నిరంతరం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం లేదని ఒక వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరోవైపు మండలంలో తాటి, మెచ్చా వర్గాల మధ్య ఆధిపత్య పోరు కూడా ఈ పరిణామాలకు కారణమనే చర్చ జరుగుతోంది.

రాష్ట్రస్థాయిలో కూడా కమ్మ, వెలమ సామాజిక వర్గాలకు చెందిన నాయకుల మధ్య ఆధిపత్య పోరు స్థానిక రాజకీయాలపై ప్రభావం చూపుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలపై పార్టీ నాయకత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం సమన్వయకర్త నియామకంపై తలెత్తిన వివాదం బీఆర్ఎస్ అశ్వారావుపేట మండల రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీయగా, కార్యకర్తలు మాత్రం పార్టీ భవిష్యత్ దిశ పై అయోమయంలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -