Tuesday, August 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపరిహార బిల్లు రద్దు

పరిహార బిల్లు రద్దు

- Advertisement -

పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో అనుయాయుల జేబులు నింపేందుకు ట్రంప్ ఎత్తుగడ
రిపబ్లికన్ సెనెటర్లు ఎదురు తిరగడంతో నిర్ణయం వెనక్కి
వాషింగ్టన్ :
జో బైడెన్ హయాంలో ప్రభుత్వ వ్యవస్థల ద్వారా వేధింపులకు గురైన వారికి పరిహారం అందించేందుకు ఉద్దేశించిన ‘యాంటీ వెపనైజేషన్ ఫండ్‌’ను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు అటార్నీ జనరల్ పదవికి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేసిన టాడ్ బ్లాంచ్ ఆదివారం రాత్రి ప్రకటించారు. తన నామినేషన్‌ను అడ్డుకుంటామంటూ సెనెట్‌లోని రిపబ్లికన్ సభ్యులు హెచ్చరికలు జారీ చేయడంతో బ్లెంచ్‌కి దిగిరాక తప్పలేదు. ‘గత కొన్ని వారాలుగా నేను, నా బృందం కమిటీ సభ్యులతోనూ, సెనెటర్లతోనూ సమావేశమై వారు వ్యక్తం చేసిన ఆందోళలపై చర్చించాము. దీంతో సమస్య పరిష్కారమైంది’ అని బ్లెంచ్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో రాసుకొచ్చారు. తాము చిత్తశుద్ధితో చర్చలు జరిపామని, దాని ఫలితంగానే ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. ప్రస్తుతం న్యాయ శాఖ తాత్కాలిక అధిపతిగా పనిచేస్తున్న బ్లెంచ్ తన పోస్టుకు ఆ ఉత్తర్వును జత చేశారు. ‘యాంటీ వెపనైజేషన్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తూ మే 18న అటార్నీ జనరల్ జారీ చేసిన ఉత్తర్వు రద్దయింది. ఇక దానికి ఎలాంటి మనుగడ, ప్రభావం ఉండదు’ అని తెలిపారు.
ఏమిటీ వివాదం ?
ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్)పై ట్రంప్ తదితరులు గతంలో పది బిలియన్ డాలర్ల నష్టపరిహారం దావా వేశారు. తన మొదటి పదవీకాలంలో పన్ను రిటర్న్‌లు లీక్ అయ్యాయని, దీనిని నిరోధించడంలో ఐఆరఎస్ విఫలమైందని ఆరోపిస్తూ ట్రంప్, ఆయన కుమారులు, ట్రంప్ ఆర్గనైజేషన్ ఈ ఏడాది జనవరిలో దావా వేశారు. అయితే మేలో న్యాయ శాఖతో అంగీకారానికి వచ్చి దానిని ఉపసంహరించుకున్నారు. జో బైడెన్ హయాంలో ప్రభుత్వ అణచివేత చర్యలలో బాధితులైన ట్రంప్ మిత్రులకు పరిహారం అందించడానికి వీలుగా 1.776 బిలియన్ డాలర్లతో ఓ నిధిని ఏర్పాటు చేసేలా పరిష్కారం కుదిరింది. ఫెడరల్ ప్రభుత్వ అణచివేతల కారణంగా తాము బాధితులమయ్యామని చెప్పుకుంటున్న వారికి… ముఖ్యంగా 2021 జనవరి 6వ తేదీన జరిగిన అల్లర్లలో పాల్గొన్న వారికి పన్ను చెల్లింపుదారుల సొమ్మును అందించడానికి ఈ నిధిని ఏర్పాటు చేశారు. అయితే ఇలా ఒప్పందం కుదుర్చుకోవడం చట్టవిరుద్ధమని, ప్రభుత్వ వ్యవస్థను తప్పుదారి పట్టించడం అవుతుందని జూలైలో ఫెడరల్ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దీనిపై ట్రంప్ న్యాయవాదులు అప్పీలు చేశారు. ఈ వివాదం అమెరికా రాజకీయాలలో తీవ్ర దుమారాన్ని రేపింది. సెనెట్ జ్యుడీషియరీ కమిటీలో సభ్యులుగా ఉన్న ఇద్దరు రిపబ్లికన్ సెనెటర్లు బ్లాంచ్ నామినేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే నిధి రద్దయిందని బ్లాంచ్ అప్పటికే చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విరమించుకుంటున్నానని న్యాయ శాఖ కూడా కోర్టులకు తెలియజేసింది. అయితే లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు.
అటార్నీ జనరల్‌గా బ్లాంచ్ నియామకంపై వారం రోజులుగా అనిశ్చితి కొనసాగుతోంది. రిపబ్లికన్ల ప్రతిఘటన నేపథ్యంలో బ్లాంచ్ నామినేషన్‌ను తాత్కాలికంగా ఉపసంహరించుకుంటానని, వచ్చే సంవత్సరం ఆ ఇద్దరు సభ్యులు సెనెట్ నుంచి వైదొలిగిన తర్వాత తిరిగి ఆయనను నియమిస్తానని ట్రంప్ ఇటీవలే చెప్పారు. ఈ నేపథ్యంలో సెనెటర్లు గురువారం బ్లాంచ్‌తో ఏకాంతంగా సమావేశమయ్యారు. చివరికి పరిహార బిల్లు రద్దుపై అంగీకారం కుదిరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -