Tuesday, August 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం10న జైల్‌భరోను జయప్రదం చేయండి

10న జైల్‌భరోను జయప్రదం చేయండి

- Advertisement -

లేబర్ కోడ్‌ల పేరుతో కార్పొరేట్లకు ఊడిగం
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా వీబీగ్రామ్ జీ చట్టం :
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, 
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జరిగే దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య పిలుపునిచ్చారు. సోమవారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జి. వాసు, రఘుపతి, వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సదస్సులో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తుందన్నారు. ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్రాన్ని విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడుదారులకు, మతోన్మాదులకు వ్యతిరేకంగా 10వ తేదీన జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బీజేపీ.. నయా ఉదారవాద సంస్కరణలను అత్యంత వేగంగా అమలు చేస్తున్నదనీ, అందులో భాగంగానే లేబర్ కోడ్‌లు తీసుకువచ్చి వాటి అమలుకు రూల్స్ నోటిఫై చేసిందని అన్నారు. విద్యుత్ సవరణ బిల్లుతోపాటు 2025 విత్తన చట్టానికి సవరణలు ప్రతిపాదించారని తెలిపారు. వామపక్షాల పోరాట ఫలితంగా సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగాచ్చేలా ఆ స్థానంలో వీబీగ్రామ్‌-జీ పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు. వీటిద్వారా వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికుల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో 32 దేశాల వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశం దిగుమతి చేసుకున్నట్టు తెలిపారు. వీటిని జీరో సుంకంతో దిగుమతి చేసుకుంటుండటంతో దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గిపోయి రైతులు దివాళా తీస్తున్నారని అన్నారు. గతేడాది డిసెంబర్‌లో పత్తిపై ఉన్న 11 శాతం సుంకాన్ని తగ్గించడం వల్ల ఇతర దేశాల నుంచి అదనంగా దిగుమతి చేసుకోవడంతో దేశంలో పత్తి ధరలు పడిపోయాయని అన్నారు. దేశంలో ఏటా 18 లక్షల కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్‌కు వస్తుండగా కనీస మద్దతు ధరలు అమలు జరగకపోవడంతో రైతులు నాలుగు లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నట్టు ప్రముఖ ఆర్థికవేత్త అశోక్ గులాటి ప్రకటించారని గుర్తు చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరల చట్టం, రైతుల రుణ విమోచన చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదించాలని ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. వీటన్నింటికి వ్యతి రేకంగా ఆగస్టు 10న జరిగే జైల్‌భరో కార్యక్రమంలో రైతులు, కార్మికులు, కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బీరెడ్డి సాంబశివ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎండీ దావూద్, సీఐటీయూ నాయకులు ఆర్. నీలాదేవి, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -