ఎస్ఎఫ్ఐ విద్యార్థి దశ నుంచే ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది
ప్రజాకవి, గాయకులు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
పేదలకు విద్యను దూరం చేసే కుట్ర : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రాములు
నవతెలంగాణ-మిడ్జిల్
కమ్యూనిజం ద్వారానే దళితులు, పేదలు సామాజికంగా చైతన్యవంతులయ్యారని, విద్యార్థి దశ నుంచే ప్రశ్నించే తత్వాన్ని ఎస్ఎఫ్ఐ నేర్పిందని ప్రముఖ ప్రజా కవి, గాయకులు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో గురువారం రాత్రి డిప్యూటీ పారామెడికల్ అధికారి వాడియాల కృష్ణయ్య ఉద్యోగ విరమణ సభలో ఆయన మాట్లాడారు. సమాజంలో దళితులు, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి, వారిలో రాజకీయ, సామాజిక చైతన్యం తీసుకురావడానికి కమ్యూనిజం ఎంతగానో దోహదపడిందని చెప్పారు. అన్యాయాలను ఎదిరించడం, హక్కుల కోసం పోరాడటం, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చడంలో ఎస్ఎఫ్ఐ పాత్ర ఎనలేనిదని తెలిపారు. విద్యార్థి దశ నుంచే సరైన భావజాలం, సామాజిక స్పృహ ఉండటం వల్ల ప్రజాస్వామ్యబద్ధంగా హక్కులను సాధించుకోవచ్చని వివరించారు. ఉద్యమాల నుంచి ఉద్యోగంలోకి వెళ్లిన కృష్ణయ్య సేవలు అభినందనీయమని కొనియాడారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు మాట్లాడుతూ.. భూస్వాములకు వ్యతిరేకంగా, పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి కృష్ణయ్య అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడానికి కుట్రలు చేస్తోందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలు తిప్పి కొట్టడానికి చైతన్యమైన యువకులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ పురుషోత్తం మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డలు పౌరుషం గలవారని చెప్పారు. కృష్ణయ్య ఉద్యోగ విరమణ పొందినప్పటికీ, ఆయన సమాజ సేవలో, చైతన్య కార్యక్రమాల్లో క్రియాశీలకంగా కొనసాగాలని కోరారు. అనంతరం వాడియాల కృష్ణయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గడ్డల విజరు కుమార్, పరుశరాములు, కృష్ణ కుమార్, జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, టీఎన్జీఓ జడ్చర్ల తాలూకా అధ్యక్షులు తిరుపతయ్య, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మొహమ్మద్ గౌస్, పాండు, హెల్త్ అసిస్టెంట్ జంగయ్య, ప్రవీణ్ కుమార్, అడ్వకేట్ రాములు తదితరులు పాల్గొన్నారు.



