హ్హు దేశంలో పిరికి పందలు ఎక్కువై పోయారు! అందుకే దేశాన్ని అభివృద్ధి చేయాలని ఎంత ప్రయత్నించినా ఫలితం రావటం లేదు. అందుకే దేశంలో పిరికి పందలు లేకుండా చేయాలి!” అన్నాడు పుష్ప ఆవేశంగా.
‘‘ఎవరినీ తిడుతున్నారు?’’ అన్నది వందన వంటింట్లోంచి. ఇంకెవర్ని పిరికి పందలను తిడుతున్నాను. వారి వల్లే దేశం ముందుకు పోవటం లేదు!” అన్నాడు పుష్ప మరింత ఆవేశంగా.
“ఇంతకూ ఎవరా పిరికి పందలు ?’’ అడిగింది వందన.
“ఇంకెవరు ఈ దేశంలోని కమ్యూనిస్టులు. ఆ మాటకొస్తే, కమ్యూనిస్టులు అంటేనే పిరికిపందలు!’’ అన్నాడు పుష్ప.
‘‘మరి ధైర్యవంతులు అంటే ఎవరు?” అంది వందన.
“మేమే ధైర్యవంతులం. అసలు మా పేరు చెబితే ధైర్యానికే ధైర్యం వస్తుంది తెలుసా?” అని పుష్ప చెబుతుండగానే బయట “ఢాం” అని శబ్దం వచ్చింది.
వెంటనే పుష్ప వంటింట్లోకి దూరి వందన పక్క నిలబడ్డాడు. “మరోసారి “ఢాం” అని శబ్దం వచ్చింది. అంతే ఈసారి వందన మీద పడిపోయాడు పుష్ప. అంతేకాక వందన చేయి బిగ్గరగా పట్టుకున్నాడు.
‘‘ధైర్యవంతులు నా చేయి పట్టుకున్నారేం?” నవ్వుతూ అడిగింది వందన.
‘‘నీవు భయపడతావని నీ చేయి పట్టుకున్నాను!’’ అన్నాడు పుష్ప,
“ఈ కవర్ డ్రైవ్ లకేమీ తక్కువ లేదు గాని, మన ఇంటి ముందే శబ్దం అయ్యింది. ఎందుకయ్యిందో చూసిరండి!’’ అన్నది వందన.
‘‘నేను వెళ్ళను. కావాలంటే నువ్వే చూసిరా!’’ అన్నాడు పుష్ప మొండిగా.
‘‘నేను బయటకు వెళితే కూర మాడిపోతుంది!’’ అన్నది వందన.
‘‘నేను చూస్తాను” అని గంటె తీసుకున్నాడు పుష్ప. వందన బయటకు వెళ్ళి చూసొచ్చింది.
‘‘పిల్లలు క్రికెట్ మ్యాచ్ గెలిచామని టపాసులు కాల్చుతున్నారు! అన్నది వందన.
‘‘నాకు తెలుసు ! అందుకే నిన్నే వెళ్ళమన్నాను. నాకేం భయం లేదు. ధైర్యం మా పార్టీలోనే ఉంది! మా నాయకుల్లో ఉంది! వారే మాకు ధైర్య ప్రధాతలు! అదిగో చూడు ఆ ఫోటోల్లో ఉన్న నాయకులను, ధైర్యానికి, శౌర్యానికి ప్రతిరూపాలలాగా కనబడుతున్నాడు!’’ అన్నాడు పుష్ప.
‘‘ఎవరు డాడీ వారంతా?’’ అంటూ వచ్చాడు నానిగాడు.
‘‘అదిగో ఆ మొదటి ఫోటోలో ఉన్నాయన స్వాతంత్య్ర యోధుడు. ఆయనను అండమాన్ జైలులో వేస్తే, రోజూ బుల్ బుల్ పిట్ట మీద బయటకు వచ్చేవాడు. ఆ రెండవ ఫోటోలోని వ్యక్తి పేరు చెబితే చైనా, పాకిస్తాన్ దేశాలకు నిద్ర కూడా రాదు. 56 ఇంచుల ఛాతీ ఆయనది. ఇక మూడో వ్యక్తి అంటే ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు హడల్ తెలుసా! అలాంటి నాయకులు ఉన్న పార్టీ మాది! ఆ నాయకుల ధైర్యమే ఈ దేశానికి ధైర్యం! కమ్యూనిస్టులంటేనే పిరికి పందలు !’’ అన్నాడు పుష్ప.
వందన పెద్దగా నవ్వింది!
‘‘మీరు చెప్పిన ధైర్యవంతుల చరిత్ర చూస్తే నవ్వు వస్తోంది. మీరు చెప్పిన స్వాతంత్ర్య యోధుడిని, అండమాన్ జైల్లో వేస్తే, ఈ జైల్లో నేను ఉండలేను. నన్ను విడుదల చేస్తే బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడనై ఉంటాను. అని క్షమాహణ పత్రం రాసిచ్చి, జైలు నుండి బయట పడి బ్రిటిషోడు ఇచ్చిన పెన్షన్ తీసుకున్నాడు. అతనిది ధైర్యమైతే, బ్రిటిష్ వారు కాల్పులు జరుపుతుంటే, వారికి దొరకకూడదని, వారి చేతిలో చావకూడదని, తన రివ్వాల్వర్‌తో తనని తాను కాల్చుకున్న ఆజాద్ చంద్రశేఖర్‌ది ఏమౌతుంది? అది ధైర్యమా లేక పిరికితనమా? ప్రశ్నించింది వందన.
‘‘ఆజాద్ చంద్రశేఖర్ పేరు చెబితేనే ధైర్యం మమ్మీ!’’ అన్నాడు నానిగాడు.
యాభై ఆరు ఇంచుల భారీ, అభినవ సర్దార్‌పటేల్ గురించీ, “వారి ధైర్యం గురించీ మీరు ఘనంగా చెబుతున్నారు. జంతర్ మంతర్‌లో పిల్లల్ని ఎందుకు కొట్టారని పార్లమెంటులో ప్రశ్నిస్తే , ఒకాయన రీల్స్ చేసుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. మరొకాయన పార్లమెంటులోని తన ఛాంబర్లోనే నక్కి, నక్కి కూర్చుంటాడు గాని సభలోకి రాడు! జవాబు చెప్పడు! ప్రశ్నలకు జవాబులు చెప్పే ధైర్యంలేని వారు కమ్యూనిస్టులను పిరికి పందలని అనటం సిగ్గుచేటు!’’ అన్నది వందన.
‘‘కమ్యూనిసులు ఎంత ధైర్యవంతులో చెప్పకుండా మా నాయకులను తిడతావేం ?” అన్నాడు పుష్ప ఉక్రోషంగా.
‘‘కమ్యూనిస్టుల ధైర్యం గురించి తెలియాలంటే, మన దేశ స్వాతంత్య్ర పోరాటం గురించి తెలుసుకోవాలి. 1922లో పెషావర్ కుట్ర కేసు, 1924లో కాన్పూర్ కుట్రకేసు, 1929లో మీరట్ కుట్రకేసు, 1930లో లాహోర్ కుట్రకేసులు ఏమిటో తెలుసుకోండి! ఈ కేసులన్నీ కమ్యూనిస్టుల మీద బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది! బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నారంటూ, ఎంతోమంది కమ్యూనిసులను పట్టుకొని కేసులు పెట్టి, కొందరిని కాల్చి చంపి, మరి కొందరిని ఉరి తీశారు! అలా ఉరి తీయబడిన వారిలో విప్లవవీర కిషోరాలు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ లాంటి వారు ఉన్నారు. ఒక్క కమ్యూనిస్టు కూడా క్షమాభిక్ష కోరలేదు! లొంగిపోలేదు!
భారతమ్మకు బ్రిటిష్ వాడు వేసిన సంకెళ్ళు తెంచటానికి, తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు! అదీ కమ్యూనిస్టులంటే!’’ అన్నది వందన.
” కమ్యూనిస్టుల గురించి వింటుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి మమ్మీ” అన్నాడు నానిగాడు.
“బాంచెన్ దొరా కాల్మొక్తా! అంటూ బానిస బతుకులు బతుకుతూ, తెలంగాణా దొరలకు, నైజాం నవాబుకు ఊడిగం చేస్తున్న తెలంగాణా మట్టి మనుషులకు సాయుధ పోరాటం నేర్పి, బంధూకు చేతబట్టించి, రజాకార్లను, దొరలను తరిమికొట్టిన వీర చరిత్ర కమ్యూనిస్టులది. ఇలాంటి వారు ఒక్కరన్నా మీ పార్టీలో ఉన్నారా? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర చదివితేనే రక్తం ఉరకలేస్తది! ధైర్యానికి స్పెల్లింగ్, మీనింగ్ తెలుస్తాయి! ఆ వీర పోరాట చరిత్ర ఇంగ్లీషులోకి ట్రాన్స్ లేట్ చేసి చాలా సం॥లు అయ్యింది! మీ నిర్మలమ్మను ఇంగ్లీష్ వెర్షన్ చదవమనండి! ధైర్యమంటే, ఏమిటీ, పిరికి పందల అంటే ఎవరి తెలుస్తుంది!” అనేది వందవ.
‘‘పిరికి పందల ఫోటోలు మన ఇంట్లో ఎందుకు మమ్మీ’’ అంటూ నావిగాడు ఆ మూడు ఫోటోలు తీసి బయట పడేశాడు.
ఉషాకిరణ్



