Friday, July 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలోటు వర్షపాతం..లోతులోకి భూగర్భజలం

లోటు వర్షపాతం..లోతులోకి భూగర్భజలం

- Advertisement -

సాగులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
రాష్ట్రంపై స్పష్టంగా ఎల్‌‌నినో ప్రభావం
28 జిల్లాల్లో లోటు వర్షపాతం ఆగస్టు నాటికి 11 మీటర్ల లోతులోకి భూగర్భజలాలు: కంటింజెన్సీ నివేదికలో వెల్లడి
విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణలో వర్షపాతానికి కీలకం నైరుతి రుతుపవనాలే. 80 శాతానికిపైగా వర్షం వాటి ఆధారంగానే పడుతున్నది. అయితే, ఎల్‌‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాలు అంతగా కురవలేదు. జులై, ఆగస్టు, సెప్టెంబర్‌ ఎల్‌‌నినో ప్రభావం వల్ల ఆ మూడు నెలల్లో వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌‌లో ఇప్పటివరకూ (జులై 14 వరకు) 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఎల్‌‌నినో నేపథ్యంలో రైతులకు పెద్ద ఎత్తున నష్టం చేరకుండా రాష్ట్ర సర్కారు కంటింజెన్సీ ప్లాన్‌ ‌వానాకాలం 2026ను విడుదల చేసింది. భూగర్భజలాలు అడుగంటుతున్న బోర్ల కింద సాగు చేసే రైతులు వరి సాగు 25 శాతానికి తగ్గించుకోవాలనీ, ఆరుతడి పంటల సాగువైపు మొగ్గుచూపాలని సూచించింది. జిల్లాల వారీగా ఇప్పటివరకు సాగైన పంటల వివరాలు, భూగర్భజలాలు పడిపోతున్న తీరు, ప్రాజెక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆలస్యమైనా అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచడం, వంటి వివరాలతో జిల్లాల వారీగా కంటింజెన్సీ ప్లాన్‌ను రూపొందించింది.

ఇప్పటిదాకా 30 శాతానికిపైగా లోటు వర్షపాతం
రాష్ట్రంలో 01.06.2026 నుంచి 14.07.2026 నాటికి 30.53 లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ములుగు, నాగర్‌‌కర్నూల్‌, రంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం రికార్డయింది. 27 జిల్లాల్లో లోటు, ఒక జిల్లా(హన్మకొండ) అత్యంత లోటు వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా చూస్తే 358 మండలాల్లో లోటు వర్షపాతం, 85 మండలాల్లో అత్యంత లోటు వర్షపాతం రికార్డయింది. 142 మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. ఎల్‌‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే మూడు నెలలు కూడా లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. అయితే, సాధారణ వర్షపాతం నమోదైన మండలాల్లోనూ ఒకటెండ్రు భారీ వర్షాలు పడటంతో అలా కనిపిస్తున్నప్పటికీ ఆ ప్రాంతాల్లోనూ కరువు ఛాయలే నెలకొన్నాయి.

పడి పోతున్న భూగర్భ జల మట్టాలు
జూన్-2026 నెలలో రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం భూ మట్టానికి 9.46 మీటర్ల దిగువనకు పడిపోయింది. ఖమ్మం జిల్లాలో సగటు కంటే 5.46 మీటర్ల లోతుకు వెళ్లగా…అదే వికారాబాద్‌ ‌జిల్లాలో 13.30 మీటర్ల అత్యంత లోతులోకి నీటిమట్టం అడుగంటింది. ఐదు నుంచి పది మీటర్ల లోతులోకి 20 జిల్లాల్లో పడిపోగా, 13 జిల్లాల్లో 10 నుంచి 15 మీటర్ల లోతునకు పడిపోయింది. రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం జులై 2026లో 10.35 మీటర్ల అడుగుభాగానికి, ఆగస్టు 2026లో 11.01 మీటర్ల అడుగుభాగానికి పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే ఆగస్టు నాటికి 1.74 మీటర్ల లోతునకు పడిపోతుందని అంచనా. అలా చూస్తే ఆగస్టులో అత్యంత లోతైన భూగర్భ జలమట్టాలు వికారాబాద్ (15.60 మీటర్లు), మెదక్ (15.20 మీటర్లు), సంగారెడ్డి (15.09 మీటర్లు), నిజామాబాద్ (14.60 మీటర్లు), సిద్దిపేట (14.28 మీటర్లు) పడిపోయే సూచనలున్నాయి.

రైతులకు వ్యవసాయ శాఖ సూచనలివే…
ప్రస్తుత నీటి లభ్యత పరిస్థితి, కాలానుగుణ వర్షపాత అంచనాల దృష్ట్యా, ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ కార్యకలాపాలను ప్రణాళిక చేసేటప్పుడు రైతులు అత్యంత జాగ్రత్త వహించాలి. తక్కువ నీటివినియోగం గల పంటలకు ప్రాధాన్యమివ్వాలి. నీటిపారుదల సౌకర్యం లేని చోట అధిక నీటి వినియోగం గల పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచొద్దు. తక్కువ కాలవ్యవధి, కరువును తట్టుకునే కంది, జొన్న, సజ్జ, రాగి, కొర్ర, నువ్వులు, ఆముదాలు, పొద్దుతిరుగుడు, పశుదాణా, కూరగాయాల వంటి పంట రకాలను ఎంచుకోవాలి. పంట పొలాల్లోనే తేమను సంరక్షించడం, వర్షపు నీటిని సేకరించే పద్ధతుల ద్వారా ప్రతి వర్షపు నీటి చుక్కను కాపాడువాలి. వాతావరణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే సూచనలు, సలహాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ దానికనుగుణంగా పంటల సాగులో జాగ్రత్తలు తీసుకోవాలి. భూగర్భ జలాలను సంరక్షించడానికి బిందు, తుంపర సేద్యం వంటి సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలను వినియోగించుకోవాలి. సాధ్యమైన చోటల్లా రీఛార్జ్ గుంటలు, వ్యవసాయ చెరువుల వంటి తగిన భూగర్భ జల రీఛార్జ్ నిర్మాణాలను నిర్మించి వర్షపు నీటిని సేకరించి నిల్వ చేసుకోవాలి. వరి సాగు విస్తీర్ణాన్ని 25 శాతానికి తగ్గించుకుని మిగతా పొలంలో ఆరుతడి పంటల్ని వేసుకోవాలి. ప్రాజెక్టుల్లో వ్యవసాయానికి సరిపోయే నీరు వచ్చి చేరే అవకాశం లేనందుకు ఆయకట్టు కింద కూడా ఆరుతడి పంటల్నే సాగు చేయాలి. పొడి భూముల్లో, తడిపొడిగా తడిసిన నేలల్లో ఎరువులను వేయకూడదు. వీలైనంత మేరకు కలుపు నివారించి పంటచేన్లలో నీటిశాతం తక్కువ కాకుండా చూసుకోవాలి. యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -