Wednesday, July 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతాజ్ బంజారా హోటల్ కూల్చివేత!

తాజ్ బంజారా హోటల్ కూల్చివేత!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ నగర చిహ్నంగా నిలిచిన బంజారాహిల్స్‌లోని తాజ్ బంజారా హోటల్ ఇక చరిత్రలో కలిసిపోనుంది. నగర ఆతిథ్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ హోటల్ కూల్చివేత పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ఈ స్థలంలో సుమారు 40 అంతస్తుల భారీ నివాస సముదాయాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

బంజారా లేక్‌ను ఆనుకుని ఉన్న 3.4 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఆస్తిని అరబిందో రియాల్టీ సంస్థ రూ.315 కోట్లకు దక్కించుకుంది. 2023లోనే హోటల్ కార్యకలాపాలు నిలిచిపోగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులో కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. మొదటగా తలుపులు, కిటికీలు, ఇతర ఫర్నిచర్‌ను తొలగించిన యంత్రాంగం, ప్రస్తుతం ప్రధాన భవనాన్ని నేలమట్టం చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో నాలుగు నెలల సమయం పట్టవచ్చని అంచనా.

1979లో ఏర్పాటైన తాజ్ బంజారా, నగరంలోని తొలి విలాసవంతమైన హోటళ్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. సినీ ప్రముఖులకు, పారిశ్రామికవేత్తలకు ఇది దశాబ్దాల పాటు ఇష్టమైన వేదికగా నిలిచింది. 1986 వరకు ఐటీసీ గ్రూప్ నిర్వహణలో ఉండగా, ఆ తర్వాత సుమారు నాలుగు దశాబ్దాల పాటు తాజ్ జీవీకే హోటల్స్ దీన్ని విజయవంతంగా నడిపించింది.

అయితే, ఆస్తిపన్ను బకాయిల కారణంగా జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ హోటల్‌ను తాత్కాలికంగా సీల్ చేశారు. సుమారు రూ.1.43 కోట్ల బకాయిలతో పాటు ఇతర కారణాల వల్ల ఇది మూసివేతకు దారితీసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -