ఘటనపై ఆరా తీసిన మాజీ ఎమ్మెల్యే
నవతెలంగాణ-ముధోల్
ముధోల్ -బిద్రేల్లి గ్రామాల మధ్య బైంసా–బాసర జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మి (68) అనే మహిళ మృతి చెందింది. రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. ముధోల్ సీఐ రవీందర్ నాయక్, ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్తి గ్రామానికి చెందిన లక్ష్మి బైంసా మండలం కోతుల్గాం గ్రామంలోని తన సోదరుడి ఇంటికి వెళ్లింది.
తిరుగు ప్రయాణంలో ముధోల్లోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అదే సమయంలో బాసర మండలానికి వెళ్తున్న ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని, ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.






కామెంట్లు (0)