చీఫ్ ఇంజినీర్ సురేష్ సస్పెన్షన్..
విద్యుదుత్పత్తిపై ప్రభుత్వ నిఘా
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి దశలో విద్యుదుత్పత్తి పనితీరును మెరుగుపరిచే విషయంలో నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాలు ప్రదర్శించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్య ఇంజినీర్ బి. సురేష్‌పై తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టీజీ జెన్కో) చర్యలు చేపట్టింది. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ విభాగం మొదటి దశ ముఖ్య ఇంజినీర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ఆయనను సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీజీ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. హరీష్, ఐఏఎస్ 2026 అక్టోబర్ 14న మెమో నంబర్ CMD/D(HR&IR)/CGM(Adm)/DS(DC-T)/AS(DC-T)/PO/VC2-132/2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
విద్యుదుత్పత్తిపై ఉన్నతస్థాయి సమీక్ష
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్లాంటులో విద్యుదుత్పత్తి లక్ష్యాలను చేరుకోవడం, యంత్రాల పనితీరును మెరుగుపరచడం, పెండింగ్ పనులను వేగంగా పూర్తిచేయడం వంటి అంశాలపై ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, టీజీ జెన్కో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
బొగ్గు సరఫరానే కీలకం
యాదాద్రి విద్యుత్ కేంద్రం పూర్తిస్థాయిలో పనిచేయాలంటే బొగ్గు సరఫరా అత్యంత కీలకం. అవసరమైన నాణ్యత గల బొగ్గును సమకూర్చుకోవడం, రవాణా సమస్యలను అధిగమించడం, ఉత్పత్తిలో జాప్యాన్ని నివారించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రత్యామ్నాయ వనరుల నుంచి బొగ్గును సమకూర్చుకునే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించినట్లు ప్రభుత్వ సమీక్షకు సంబంధించిన సమాచారం వెల్లడిస్తోంది.
రైతులకు నిరంతర విద్యుత్ లక్ష్యం
వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా చూడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశాల నేపథ్యంలో ఉత్పత్తి కేంద్రాల పనితీరును మెరుగుపరచాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం వహించినా, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోయినా కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలను తాజా పరిణామాలు ఇస్తున్నాయి.
బాధ్యులపై చర్యలు.. పనితీరుపై నిఘా
యాదాద్రి విద్యుత్ కేంద్రంలో బొగ్గు నిల్వలు, యూనిట్ల పనితీరు, సాంకేతిక సమస్యలు, నిర్మాణ పనులు, నిర్వహణ వ్యవహారాలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అధికారుల బాధ్యతలను స్పష్టం చేస్తూ విద్యుదుత్పత్తి మెరుగుదలకు చర్యలు చేపడుతోంది.
యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ప్రత్యేక సమీక్ష
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులను ప్రశ్నించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23న నిర్వహించిన విద్యుత్ శాఖ ఉన్నతస్థాయి సమీక్షలో దసరా లోపు ప్లాంట్‌లో పూర్తిస్థాయి విద్యుదుత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు లభ్యత, రవాణా వ్యయం, విద్యుదుత్పత్తి సామర్థ్యం, రాష్ట్ర విద్యుత్ అవసరాలపై సమావేశంలో చర్చించారు. యాదాద్రి ప్లాంట్‌కు అవసరమైన జీ-9 గ్రేడ్ బొగ్గు లభ్యతపై ప్రత్యేకంగా సమీక్షించారు. సింగరేణి నుంచి ఈ గ్రేడ్ బొగ్గు లభించడంలో ఇబ్బందులు ఉన్నందున మహానది కోల్‌ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.






కామెంట్లు (0)