విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి
జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
నవతెలంగాణ-అచ్చంపేట
ఇంటర్మీడియట్ కోర్సుల నిర్వహణ, విద్యార్థుల ప్రవేశాలలో 100% నమోదు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని నడింపల్లి గ్రామంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పాఠశాలలోని మౌలిక వసతులు, సౌకర్యాలు, బోధన, భోజన ఏర్పాట్లు, ఇంటర్మీడియట్ కోర్సుల నిర్వహణ, విద్యార్థుల ప్రవేశాల నమోదు తదితర అంశాలను గూర్చి పాఠశాల ప్రత్యేక అధికారిని కుసుమను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..పాఠశాల భద్రత దృష్ట్యా ప్రహరీ గోడ నిర్మాణం ఎంతో ముఖ్యమని, నిర్మాణ పనులు వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ కోర్సుల్లో 160 మంది విద్యార్థులకు గానూ 95 మంది విద్యార్థులు ఉన్నారని ఉపాధ్యాయులు కలెక్టర్ కు వివరించారు. నల్లమల్ల అటవీ ప్రాంత విద్యార్థినిలకు ఏఐ (ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత విద్యను అందించి, భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశాలను వివరించి, వారిని ప్రోత్సహించాలని సూచించారు. పదో తరగతి బోర్డు ఎగ్జామ్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలనీ, ప్రతి విద్యార్థినిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు తెలిపారు. విద్యార్థినులకు నాణ్యమైన, పౌష్టిక విలువలతో కూడిన భోజనం అందించాలని సూచించారు. తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర వసతుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు.
ఇంటర్మీడియట్ విద్యార్థినులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మించాల్సిన అవసరం ఉందని, క్రీడా ప్రాంగణాన్ని కూడా అభివృద్ధి చేయాలని పాఠశాల ప్రత్యేక అధికారి కుసుమ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. అవసరమైన సౌకర్యాల కల్పనకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్రీడా మైదానాన్ని పూర్తిస్థాయిలో లెవలింగ్ చేసి విద్యార్థినులకు అనువైన ఆటస్థలంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించేలా ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కేజీబీవీ విద్యార్థినుల సంక్షేమం విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోపి పద్మ, మండల విద్యాధికారి శ్రీనివాస మూర్తి, ఉన్నారు.







కామెంట్లు (0)