- 28నుంచి 30వ తేదీ వరకు
- 33 జిల్లాలు, 34 టీములు, 71 మ్యాచ్‌లు
- పోటీలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం
- టీజీఐడీసీ, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణంలోని రాణీ సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్ వేదికగా ఈ నెల 28 (బుధవారం) నుంచి 30 వరకు 73వ రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లా కబడ్డీ అసోసియేషన్, మువ్వా విజయ్ బాబు యూత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మహా క్రీడా వేడుకను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి మొత్తం 34 జట్లు (హైదరాబాద్ నుంచి రెండు జట్లు సహా) ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయి. సుమారు 550 మంది మహిళా క్రీడాకారిణులు, 68 మంది కోచ్‌లు, మేనేజర్లు, 60 మంది జాతీయ స్థాయి రిఫరీలు ఈ పోటీలకు హాజరుకానున్నారు. మూడు రోజులపాటు జరిగే మహిళా కబడ్డీ పోటీల్లో 71 మ్యాచ్లు ఆడించనున్నారు.
తుఫాను ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో...
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వర్ష ప్రభావం పడకుండా పెద్ద రేకుల షెడ్లు, ప్రత్యేక సింథటిక్ క్రీడా మైదానాలను నిర్వాహకులు సిద్ధం చేశారు. క్రీడాకారుల కోసం పట్టణంలోని రెండు ఫంక్షన్ హాల్స్, పలు లాడ్జిలలో వసతి, భోజన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రో కబడ్డీ తరహాలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో మ్యాచ్‌లను ఉత్సాహభరితంగా నిర్వహించనున్నారు.
డిసెంబర్‌లో హిమాచల్ ప్రదేశ్‌లో జరుగనున్న జాతీయస్థాయి మహిళా కబడ్డీ పోటీలకు తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించే అత్యుత్తమ జట్టును ఇక్కడే ఎంపిక చేయనున్నారు. ఈ నెల 28న రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన పురస్కరించుకుని ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఈ పోటీలను అధికారికంగా ప్రారంభిస్తారని టీజీఐడీసీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు సోమవారం రాణి సెలబ్రేషన్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 30న ముగింపు వేడుకల్లో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా గెలుపొందిన జట్లకు బహుమతుల ప్రదానం జరుగనుందని విజయబాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొంటారని విజయ బాబు చెప్పారు.
కబడ్డీ పోటీలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశాం. 28వ తేదీ (బుధవారం) నుంచి 30వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు టీజీఐడీసీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు తెలిపారు. గత రెండు రోజులుగా విజయబాబు ఖమ్మం జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ కటికల క్రిస్టోఫర్ బాబుతో ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి మహిళా కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహించాలని విజయబాబు కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ తోట సుజలరాణి, బేతుపల్లి సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు), కౌన్సిలర్ మట్టా ప్రసాద్, గణేష్, కోటేశ్వరరావు, నాగరాజు, సతీష్, రాంబాబు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)