- నాలుగు ‘పీ’లను పాటించాలని సాఫ్ట్వేర్ డెవలపర్ అజ్మీరా కీర్తి సూచన
నవతెలంగాణ -అశ్వారావుపేట
జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలంటే ఉద్దేశం, ప్రణాళిక, సాధన, సహనం అనే నాలుగు అంశాలను తప్పనిసరిగా పాటించాలని ప్రముఖ అమెరికా సాఫ్ట్వేర్ డెవలపర్ అజ్మీరా కీర్తి అన్నారు. పర్పస్, ప్లాన్, ప్రాక్టీస్, పేషన్స్ అనే నాలుగు ‘పీ’లను ఆచరిస్తూ ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు.
సోమవారం పీఎం శ్రీ ఎంపీయూపీఎస్ నారంవారిగూడెం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పున్నం చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ ఎమినెంట్ ఎక్స్పర్ట్ టాక్స్’ కార్యక్రమంలో ఆమె అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం అమెరికాలోని బెస్ట్ బై సంస్థలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న కీర్తి మాట్లాడుతూ, కేవలం లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం మాత్రమే సరిపోదని, దాన్ని సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికతో నిరంతరం సాధన చేస్తూ, ఓర్పుతో ముందుకు సాగాలని సూచించారు.
అమెరికాలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ క్యాపిటల్ వన్‌లో డెవలపర్‌గా పనిచేస్తున్న అత్తునూరు స్పందన రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు గణనీయంగా పెరిగాయని, వాటిని సద్వినియోగం చేసుకుని పేద కుటుంబాల విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తాను కూడా పేద రైతు కుటుంబంలో జన్మించి, ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో కష్టపడి చదివి ప్రస్తుత స్థాయికి చేరుకున్నానని వివరించారు.
తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులు ఉపాధ్యాయులేనని, గురువులను ఎల్లప్పుడూ గౌరవించాలని ఆమె సూచించారు.
అనంతరం ప్రధానోపాధ్యాయులు పున్నం చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ చిన్న వయసులోనే ఉన్నత స్థానాలకు ఎదిగిన అజ్మీరా కీర్తి, అత్తునూరు స్పందన రెడ్డి విద్యార్థులకు ఆదర్శమని అన్నారు. తమ పాఠశాల విద్యార్థులకు విలువైన ప్రేరణాత్మక సందేశాలు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బండి శ్రీనివాస్‌రెడ్డి, రేణుక, ఆశిక్ ఆలం, సోయం రవిబాబు, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.






కామెంట్లు (0)