- జూపల్లి కోదండ వెంకట్ రామారావుకు జాతీయ స్థాయి బాధ్యతలు
- అభినందించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్
నవతెలంగాణ - అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట మఅచ్యుతాపురం గ్రామానికి చెందిన జూపల్లి కోదండ వెంకట్ రామారావుకు యూత్ కాంగ్రెస్లో జాతీయ స్థాయి బాధ్యతలు దక్కాయి. యూత్ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ (ప్రీ నేషనల్ ఆఫీస్ బేరర్)గా ఆయన నియమితులయ్యారు. ఈ నియామకంతో అశ్వారావుపేటకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
యూత్ కాంగ్రెస్ జాతీయ ఇన్చార్జి మనీష్ శర్మ, జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చీబ్ నాయకత్వంలో బెంగళూరులో రెండు రోజులపాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరానికి రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ నాయకత్వం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడంతోపాటు, కర్ణాటక రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ సంస్థాగత కార్యకలాపాలకు సంబంధించి వర్క్ అలొకేషన్ కేటాయించింది.
రామారావు గతంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం కోఆర్డినేటర్గా, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తూ, యువతను సమన్వయం చేసుకుంటూ సంస్థాగత బలోపేతానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా జాతీయ స్థాయి బాధ్యతలు లభించాయి.
తనకు ఈ అవకాశం కల్పించేందుకు కృషి చేసిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఇన్చార్జిలు సయ్యద్ ఖాలిద్ అహ్మద్, కేఆర్ భవ్య, రోషిణితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డికి రామారావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకంపై అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ రామారావును అభినందించారు. జాతీయ స్థాయిలో మరిన్ని ఉన్నత బాధ్యతలు చేపట్టి పార్టీ అభివృద్ధికి, యువత రాజకీయ చైతన్యానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.







కామెంట్లు (0)