తెలంగాణ రైతు సంఘం డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు
నవతెలంగాణ-సత్తుపల్లి
ధాన్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతులకు అందాల్సిన మద్దతు ధరను తగ్గిస్తూ, తక్కువ రేట్లకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని తెలంగాణ రైతు సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు ఆరోపించారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులకు అమ్మకం సమయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పెట్టుబడులు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
అయితే దానికి తగినట్లుగా ధాన్యానికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని తెలిపారు. వ్యాపారులు పరస్పరం కుమ్మక్కై ధరలను తగ్గించడమే ఈ పరిస్థితికి ముఖ్య కారణమని అన్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని రాజబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రతీ రైతుకు దక్కేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పేరుతో రైతులను అనవసరంగా ఇబ్బందులకు గురిచేయకూడదని కోరారు.
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారుల సిండికేట్‌పై అధికారులు వెంటనే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లభించి, పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు రైతు సంఘం తరఫున పోరాటాలు కొనసాగిస్తామని రాజబాబు హెచ్చరించారు.






కామెంట్‌లు (0)