Magazines

దూసుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు.. 

5 గంటల క్రితం

avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 17, 2026 | 3 నిమిషాల చదవడం

- రైతులకు కష్టకాలం!

- అర్ణబ్, మురసు తుఫాన్ల నుంచి కోలుకోకముందే మరో ముప్పు

- ఈనెల 20న అతి భారీ వర్షాల సూచన

- ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక

నవతెలంగాణ - అశ్వారావుపేట

ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు వరుస తుఫాన్లు, అకాల వర్షాలు.. 

ఇప్పుడు మరో తుఫాన్ ముప్పు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.అర్ణబ్, మురసు తుఫాన్ల ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే అక్వాన్ తుఫాన్ రూపంలో మరో ప్రకృతి విపత్తు పొంచి ఉంది. ఈనెల 20న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మహబూబాబాద్,సూర్యాపేట జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.దీంతో చేతికొచ్చిన పంటలను కాపాడుకోవడానికి రైతులు అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కోత దశలో ప్రధాన పంటలు:Another storm

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వానాకాలం సాగు విస్తీర్ణం గణనీయంగా ఉంది. వరి 1,39,978 ఎకరాలు, పత్తి 2,37,239 ఎకరాలు, మొక్కజొన్న 66,408 ఎకరాల్లో సాగు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యంగా కురవడంతో వరి నాట్లు వివిధ సమయాల్లో పడ్డాయి. ప్రస్తుతం వరి పంట గింజ నిండే దశ నుంచి కోత దశకు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో కోతలు కూడా ప్రారంభమయ్యాయి. వరి సాగు విస్తీర్ణం తగ్గిన నేపథ్యంలో వడ్లకు డిమాండ్ పెరిగింది. పచ్చి వడ్లకు సైతం మద్దతు ధర కంటే అధిక ధర లభిస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో మరో తుఫాన్ హెచ్చరిక రైతులను కలవరపెడుతోంది.

పత్తికి నాణ్యత దెబ్బ:

తుఫాన్లు, ముసురు వర్షాల ప్రభావంతో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో మొదటి విడత పత్తి ఏరడం మాత్రమే పూర్తయింది. వర్షాల కారణంగా కాయల నుంచి బయటకు వచ్చిన దూది తడిసి రంగు మారడంతో నాణ్యత దెబ్బతింటోంది. పెసర, మినుము కోతలు పూర్తికాగా, మొక్కజొన్న కోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రానున్న నాలుగు రోజులు రైతులకు అత్యంత కీలకంగా మారాయి.

రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని కోతకు వచ్చిన వరి పంటను వీలైనంత త్వరగా కోత కోయాలి. ఏరడానికి సిద్ధంగా ఉన్న పత్తిని వర్షాలకు తడవకుండా తీసుకోవాలి. మొక్కజొన్న పంటలోనూ తగిన జాగ్రత్తలు పాటించాలి. గత రెండు తుఫాన్ల ప్రభావంతో అధిక వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ముంపు సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.

యాసంగి సాగుపైనా ప్రభావం:

యాసంగి పంట కాలం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సీజన్‌లో వరి సాగు చేయకుండా తక్కువ నీటి అవసరముండే ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది. గ్రామాల వారీగా, రైతుల వారీగా సాగు చేయనున్న పంటల వివరాలను క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా యాసంగి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే మొక్కజొన్న, వేరుశనగ, పెసర, మినుము, అలచంద, జొన్న పంటల సాగు ప్రారంభమైంది. అయితే వేరుశనగ సాగు చేయాలనుకునే రైతులు తుఫాన్ ప్రభావం తగ్గేవరకు వేచి ఉండటం మంచిదని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు. అధిక ఖర్చుతో కొనుగోలు చేసే విత్తనాలు వర్షాలకు దెబ్బతింటే రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

రైతులకు భరోసా ఏదీ?:

ఎల్‌నినో ప్రభావం, వరుస తుఫాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకురాలేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు కొంతైనా ఆర్థిక భరోసా లభించేది. మరోవైపు కరువు మండలాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో అనావృష్టి కారణంగా జరిగిన పంట నష్టంపై అంచనాలు రూపొందించినా పరిహారం విషయంలో స్పష్టత లేదు. రైతులు తీసుకున్న పంట రుణాల రీషెడ్యూలింగ్ కూడా జరగలేదు. ప్రకృతి వైపరీత్యాలతో వరుస నష్టాలను ఎదుర్కొంటున్న రైతులకు పంటల బీమా, పంట నష్టపరిహారం, రుణాల రీషెడ్యూలింగ్ ద్వారా ప్రభుత్వం తక్షణమే భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్