•ఆవాస గ్రామాలకు అసలే రాదు
•పలుమార్లు విన్నపించిన ప్రయోజనం శూన్యం
•గ్రామీణ రవాణాపై అధికారుల నిర్లక్ష్యం
•బస్సు సౌకర్యం కల్పించాలంటూ ప్రజల డిమాండ్
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలో 18 గ్రామపంచాయతీలు, 42 ఆవాస గ్రామాలు, 40798 ల జనాభా ఉంది.నల్లగొండ జిల్లాలో హైదరాబాద్ కు అతి సమీపంగా ఉన్న మండలం మర్రిగూడ.కాని మండలంలో రోజురోజుకూ ఆర్టీసీ ప్రయాణం ప్రశ్నార్థకంగా మారుతోంది.మండలంలోని పలు గ్రామాలు,ఆవాస ప్రాంతాల్లో సరైన ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు తమ ప్రయాణం అవసరాల నిమిత్తం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మండల,పట్టణ ప్రాంతాలకు వెళ్లాలంటే బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంటోందని,తద్వారా విద్యార్థులు,మహిళలు,వృద్ధులు,వికలాంగులు ఇబ్బందులకు గురవుతున్నారని వాపోతున్నారు.
విద్యార్థులకు తప్పని తిప్పలు
గ్రామాల నుంచి మండల,పట్టణ ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు బస్సులు లేక నానా అవస్థలు పడుతున్నారు.మండలంలోని దామెర భీమనపల్లి పంచాయతీ పరిధిలో 3 వేల జనాభా ఉంటుంది.ఆ గ్రామంతో పాటు దాని పరిధిలోని కమ్మగూడ,తండా గ్రామాలకు సరైన బస్సు సౌకర్యం లేదు.ఉన్న ఒక్క గుర్రంపోడు బస్సు ఉదయం 11 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటలకు రిటర్న్ అవుతుంది.అదేవిధంగా కొట్టాల,ఇందుర్తి పరిస్థితి కూడా అంతే.సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ఆటోలు,ఇతర వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.దీంతో పేద,మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడడంతో పాటు ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి.
బస్సు సౌకర్యానికి నోచుకోని గ్రామాలు
మండలంలో నేటికీ సరైన బస్సు సౌకర్యానికి నోచుకోని మేజర్ గా కొన్ని గ్రామాల వివరాలు:1.దామెర భీమనపల్లి,గ్రామ పంచాయతీ పరిధిలోని కమ్మగూడ,కమ్మగూడ తండాలు.2.అజ్జలపురం,నరసింహాపురం, గ్రామపంచాయతీ పరిధిలోని కొన్ని గ్రామాలు.3. వెంకె పల్లి,వెంకె పల్లి తండా.4.తమ్మడపల్లి 5. కొట్టాల 6. ఇందుర్తి.7.వట్టిపల్లి.వీటితో పాటు ఇంకా కొన్ని ఆవాస గ్రామాలు కూడా ఉన్నాయి.
గ్రామీణ రవాణాపై అధికారుల నిర్లక్ష్యం
ఆర్టీసీ బస్సు రవాణా సమస్యలపై మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచులు పలుమార్లు డిపో మేనేజర్ కు కంప్లైంట్ ఇచ్చిన కూడా ఆర్టీసీ అధికారుల ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కంప్లైంట్ ఇచ్చినప్పుడే రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పడం తప్ప నేటికీ సమస్యను పరిష్కరించిన దాఖలాలు లేవని బాధిత గ్రామాల సర్పంచులు అధికారుల తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిన కూడా అసలు బస్సు సౌకర్యమే లేనప్పుడు దేనికి ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు.
ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నా ప్రయోజనం ఏది?
ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల ప్రయాణికులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరడం లేదనే విమర్శలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.మండలంలో కొన్ని గ్రామాలలో బస్సులు తిరుగుతున్నా,మరికొన్ని గ్రామాల్లో సర్వీసులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఇక ఎలక్ట్రిక్ బస్సులు తిరిగే గ్రామాలలో కొన్ని నిర్ణీత బస్స్టాప్లలో బస్సులు ఆగడం లేదనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి.ఆ మారుమూల గ్రామాలకు వచ్చేదే 2 గంటలకు ఒక బస్సు ఇక వచ్చిన బస్సు కూడా ఆగకుంటే ఎలా అని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించాలి
మండలంలోని బస్సు సౌకర్యం లేని గ్రామాలను అధికారులు గుర్తించి ప్రత్యేక సర్వే నిర్వహించి రవాణా సౌకర్యం కల్పించాలని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.విద్యార్థులు,ఉద్యోగులు,రైతులు,కూలీల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉదయం మరియు సాయంత్రం వేళల్లో సరైన సమయాలలో అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.గ్రామాలలో జన సమూహాలు ఉన్న ప్రదేశాలలో కూడా ఎలక్ట్రిక్ బస్సులు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.
మా గ్రామానికి ఉన్నది ఒక్కటే బస్సు
•రమావత్ లక్ష్మణ్ (కమ్మగూడ సర్పంచ్ )
మా గ్రామానికి ఉన్నది ఒక్కటే గుర్రంపోడు బస్ ఉదయం 11 వస్తే, మళ్లీ అదే బస్సు రిటర్న్ సాయంత్రం 6 గంటలకు వస్తుంది.గ్రామపంచాయతీ పరిధిలో 3 వేల జనాభా ఉంటుంది.అధికారుల స్పందించి ప్రజల ఉపయోగ నిమిత్తం మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలి.
కంప్లైంట్ ఇచ్చిన స్పందన శూన్యం
•కల్లెట్ల లింగయ్య( కొట్టాల గ్రామ సర్పంచ్)
మేటి చందాపురం గ్రామపంచాయతీ పరిధిలో సరైన రవాణా సౌకర్యం లేక విద్యార్థులకు,వృద్ధులకు, మహిళలకు , ఉద్యోగులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డిపో మేనేజర్ కు పలుమార్లు కంప్లైంట్ ఇచ్చిన స్పందన లేదు.ప్రజల అవసరాల నిమిత్తం మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలి.
ఎలక్ట్రిక్ బస్సులు ఆగటం లేదు
•మేతరి రాములు(గ్రామం:మేటి చందాపురం, విహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి)
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు కొన్ని గ్రామాలలో ఆగటం లేదు.గ్రామ సెంటర్ తో పాటు గ్రామంలో మేజర్ జనసమూహం ఉండే ప్రదేశాలలో కూడా ఎలక్ట్రిక్ బస్సు ఆపాలి.మా రూట్ లో వచ్చేదే 2 గంటలకు ఒక బస్సు.
సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం
•లావణ్య (నల్లగొండ డిపో మేనేజర్)
మండలంలో రవాణా సౌకర్యం లేని గ్రామాల లిస్ట్ ఇస్తే సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం.ఇక ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు ఎక్స్ప్రెస్ కాబట్టి అన్నిచోట్ల ఆగడానికి అవకాశం ఉండదు.అదే ఆర్డినరీ బస్సులు ప్రయాణికులు ఆపినచోట ఆపడం జరుగుతుంది.






కామెంట్లు (0)