మేడ్చల్ డీఎంహెచ్‌వో ఆనంద్‌ను కోరిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
నవతెలంగాణ – నాచారం
చర్లపల్లి ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మంజూరు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) ఆనంద్‌ను కలిసి చర్లపల్లిలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చర్లపల్లి ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తే స్థానిక ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువవుతాయని తెలిపారు.
అత్యవసర సమయాల్లో సకాలంలో వైద్య చికిత్స పొందేందుకు, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు అందించేందుకు పీహెచ్‌సీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని పీహెచ్‌సీ మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరారు.దీనిపై స్పందించిన డీఎంహెచ్‌వో ఆనంద్ త్వరలోనే చర్లపల్లి ప్రాంతాన్ని సందర్శించి, పీహెచ్‌సీ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి, అవసరమైన వివరాలను సేకరిస్తామని తెలిపారు. చర్లపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు దిశగా అధికారులు పరిశీలన చేపట్టనున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.







కామెంట్‌లు (0)