నవతెలంగాణ-మిడ్జిల్
ఆపదలో ఉన్న తోటివారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వం అని నిరూపించారు 'చేయూత' సభ్యులు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దిశ విలేఖరి బరిగల శ్రీనివాసులును మంగళవారం రాత్రి చేయూత బృందం పరామర్శించి, ఆయన వైద్యానికి తమ వంతుగా రూ. 27,000 ఆర్థిక సహాయాన్ని అందజేసింది.
నిత్యం ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తూ సమాజ హితం కోసం శ్రమించే ఓ విలేఖరి నేడు అనారోగ్యంతో ఆస్పత్రి పాలవడం అందరినీ కలచివేసింది. విషయం తెలుసుకున్న చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు వెంకటేష్ చొరవ తీసుకుని సభ్యులతో కలిసి ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మీకు మేమంతా అండగా ఉన్నామనీ, ఆర్థిక చేయూతతో పాటు మానసిక ధైర్యం అందించి, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు.
ఈ కార్యక్రమంలో చేయూత అధ్యక్షులు వెంకటేష్‌తో పాటు సభ్యులు రాఘవేందర్ రెడ్డి, బాబా, రాజేష్ కుమార్ మాదిగ, పాల్గొని ఆర్థిక సాయాన్ని అందజేశారు. వీరితో పాటు సహకారం చేసిన చేయూత సభ్యులు జోసెఫ్ రాణి పేట , రాజారెడ్డి ఊరుకొండ, వెంకట్ రెడ్డి మిడ్జిల్ ,వెంకట్ సాగర్, శివ ప్రసాద్, నరేష్ మహబూబ్నగర్ , కష్టకాలంలో ఆపన్నహస్తం అందించిన చేయూత సభ్యుల దాతృత్వాన్ని పలువురు అభినందిస్తున్నారు.







కామెంట్‌లు (0)